Rahul Gandhi: వ్యాపార సంస్థల లబ్ధి కోసమే అగ్నివీర్‌ పథకం.. కేంద్రంపై రాహుల్ విమర్శలు

రక్షణ రంగ బడ్జెట్‌ను సైనికుల జీతాలు, ప్రోత్సాహకాల కోసం ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం భావించడం లేదని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Updated : 16 Feb 2024 20:33 IST

కైముర్‌: దేశంలోని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూరేలా రక్షణ రంగ బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటోందని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gadhi) ఆరోపించారు. ఇందుకోసమే కేంద్రం అగ్నివీర్‌ పథకాన్ని (Agniveer Scheme) ప్రవేశపెట్టిందన్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా బిహార్‌లోని కైముర్‌ జిల్లాలో మొహనియాలో స్థానిక యువతతో ఆయన ముచ్చటించారు. ఈ ప్రాంతం బిహార్‌-ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఇక్కడి యువతలో ఎక్కువమంది కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. రెండేళ్ల క్రితం ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్‌ పథకానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఎక్కువమంది యువత ఆందోళనకు దిగారు.  

ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

‘‘సాధారణ సైనికులకు లభించినట్లు అగ్నివీర్‌లకు జీతం, పెన్షన్‌ లభించవు. క్యాంటీన్‌ వసతి కూడా ఉండదు. రక్షణ బడ్జెట్‌లో సైనికుల జీతాలు, ప్రోత్సాహకాల కోసం ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం భావించడం లేదు. ఆ మొత్తాన్ని దేశంలోని బడా వ్యాపార సంస్థల లబ్ధి కోసం ఖర్చు చేయాలనుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి.. అధికారంలోకి రాగానే 45 ఏళ్లలో రికార్డు స్థాయిలో దేశంలో నిరుద్యోగుల సంఖ్యను పెంచారు ’’ అని రాహుల్‌ విమర్శించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమైన రాహుల్‌.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పంటకు కనీస మద్దతు ధర (MSP)కి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని