Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Priyanka Gandhi: రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయయాత్రలో ఆయన సోదరి ప్రియాంక నేడు పాల్గొనాల్సి ఉంది. అయితే ఆమె అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేరారు.

Published : 16 Feb 2024 16:40 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆమె ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో వెల్లడించారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కోసం ఎంతగానో ఎదురుచూశా. కానీ, ఈరోజే అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోలుకున్న వెంటనే నేను యాత్రలో పాల్గొంటా’ అని ఆమె పోస్ట్ చేశారు. 

మణిపుర్‌ నుంచి ముంబయి వరకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ కొనసాగుతోంది. ప్రస్తుతం బిహార్‌లో ఉన్న ఈ యాత్ర.. శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరనుంది. యూపీలో రాహుల్‌తో కలిసి ప్రియాంక కూడా పాల్గొంటారని కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ఆమె అనారోగ్యానికి గురవడంతో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లు తెలిపారు.

ఎన్నికల ముందు స్తంభించిన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు..

నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు, ఆ తర్వాత 24, 25వ తేదీల్లో రాహుల్‌ యాత్ర యూపీలో కొనసాగనుంది. మరి ప్రియాంక ఇందులో ఎప్పుడు పాల్గొంటారన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కాగా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇదే రాష్ట్రంలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

గత కొన్నేళ్లుగా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికలకు ఆమె నామినేషన్‌ వేశారు. అయితే, రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేస్తారని సోనియా సూచనప్రాయంగా వెల్లడించారు. దీంతో అక్కడినుంచి ప్రియాంక పోటీ ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని