మంత్రులవే ప్రాణాలా? విద్యార్థులవి కాదా?

కరోనా తీవ్రత దృష్ట్యా మంత్రివర్గ సమావేశం వాయిదా వేయించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. పది, ఇంటర్‌ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు..

Published : 30 Apr 2021 01:06 IST

ఏపీ సర్కార్‌ను ప్రశ్నించిన లోకేశ్‌

అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా మంత్రివర్గ సమావేశం వాయిదా వేయించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. పది, ఇంటర్‌ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. సీఎంవి, మంత్రులవే ప్రాణాలా? లక్షల మంది విద్యార్థులవి ప్రాణాలు కావా? అని నిలదీశారు. ఇంటి నుంచి సచివాలయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఆరోగ్యరక్షణ ఏర్పాట్ల మధ్య వెళ్లి 30 మందితో దూరంగా ఉండి పాల్గొనే మంత్రివర్గ సమావేశం వల్ల కరోనా సోకుతుందని భయపడి వాయిదా వేయించారని విమర్శించారు. 15లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్షల నిర్వాహకులు, ఇతరత్రా అంతా కలిసి 80 లక్షల మందికి పైగా పరీక్షలకు రోజూ రోడ్లమీదకు రావాల్సి ఉంటుందన్నారు. వారికి కరోనా సోకదా? అని ప్రభుత్వాన్ని లోకేశ్‌ ప్రశ్నించారు. 

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు..: సోమిరెడ్డి

ప్రభుత్వం పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలనుకోవడం విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. పరీక్షల కారణంగా లక్షల మందికి కరోనా ముప్పు పొంచి ఉందని గ్రహించే కేంద్రంతోపాటు దాదాపు 20 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం చేశాయన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టింపులకు పోతోందన్న సోమిరెడ్డి.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం తగదన్నారు. ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముందు వైద్య సదుపాయాలు పెంచి ప్రజల ప్రాణాలు కాపాడాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని