President Poll: రాజస్థాన్‌ ఎఫెక్ట్‌.. అధ్యక్ష రేసునుంచి వైదొలగిన గహ్లోత్‌

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పోటీపై స్పష్టత వచ్చింది.

Updated : 29 Sep 2022 16:08 IST

దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పోటీపై స్పష్టత వచ్చింది. తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. పార్టీ అధినేతగా ఎన్నికైనా, ఆయన ముఖ్యమంత్రి పదవిని వీడాలనుకోకపోవడంతో రాజస్థాన్‌లో రాజకీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అనంతరం.. ఆయన రేసు నుంచి బయటకు వచ్చారు.అలాగే ఎమ్మెల్యే తిరుగుబాటు నేపథ్యంలో సోనియాకు క్షమాపణలు తెలియజేశారు. 

బుధవారం రాత్రి దిల్లీకి వచ్చిన గహ్లోత్ ఈ రోజు మధ్యాహ్నం సోనియాతో భేటీ అయ్యారు. గంటన్నరపాటు వీరి సమావేశం సాగింది. అనంతరం బయటకు వచ్చిన ఆయన అధ్యక్ష ఎన్నికలో పోటీచేయడం లేదని చెప్పారు. అయితే అంతిమ నిర్ణయం పార్టీదేన్నారు. ‘ఈ రోజు నేను సోనియాగాంధీతో మాట్లాడాను. రెండురోజుల క్రితం జరిగిన పరిణామాలతో మేం షాక్‌కు గురయ్యాం. నేను ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నందుకే ఇదంతా జరిగిందనే అంతా భావించారు. ఈ పరిణామాలపై నేను సోనియాకు క్షమాపణలు తెలియజేశాను.

నేను కొచ్చిలో రాహుల్ గాంధీని కలిశాను. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలని కోరాను. ఆయన అంగీకరించకపోవడంతో.. నేను పోటీ చేస్తానని చెప్పాను. ఈ సమయంలో రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఒకే వాక్య తీర్మానం అనేది పార్టీ సంప్రదాయం. దురదృష్టవశాత్తూ తీర్మానం ఆమోదించలేని పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ.. పోటీ నుంచి వైదొలుగుతున్నాను’అని వెల్లడించారు. అలాగే రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా..? అని అడిగి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘అది నేను నిర్ణయించలేను. దానిపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారు’అని తెలిపారు.

దిగ్విజయ్‌ పోటీ ఖరారు..

ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నిక బరిలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ ఖరారైంది. గురువారం ఆయన నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ‘నేను నామినేషన్ పత్రాలు తీసుకున్నాను. వాటిని శుక్రవారం సమర్పిస్తాను’ అని మీడియాకు వెల్లడించారు. ఆయన పది సెట్ల పత్రాలను తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఎంపీ శశిథరూర్ కూడా పోటీలో ఉన్నారు. నామినేషన్ల సమర్పణకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో రేపు వారిద్దరు పత్రాలు సమర్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని