Atchannaidu: దిల్లీ నుంచి చంద్రబాబుకు పిలుపు.. రాత్రికి భాజపా నేతలతో భేటీ: అచ్చెన్నాయుడు

తెదేపా-జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైకాపా వణికిపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు.

Updated : 07 Mar 2024 15:33 IST

అమరావతి: తెదేపా-జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైకాపా వణికిపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్లారని విమర్శించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో తెదేపా-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని డిమాండ్‌ చేశారు. ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెదేపా-జనసేన నేతలపై పోలీసుల వేధింపులు మానుకోవాలని.. వారి తీరు మారకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పారు. ఆ వేధింపుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ను (73062 99999) ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కలిసికట్టుగా విజయవంతం చేస్తామని చెప్పారు. సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. బుధవారం రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు మంచిది కాదన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.

దిల్లీ నుంచి పిలుపు

చంద్రబాబుకి దిల్లీ నుంచి పిలుపు వచ్చిందని అచ్చెన్న తెలిపారు. దిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా రాత్రికి దిల్లీ చేరుకుంటారని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. పొత్తులపై శుక్రవారంనాటికి పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని