BJP: రామగుండంలో ప్రధాని మోదీ బహిరంగ సభ.. భారీ జనసమీకరణకు భాజపా ప్లాన్‌

రామగుండంలో ప్రధాని మోదీ బహిరంగసభకు కనీవినీ ఎరుగని రీతిలో భారీగా జన సమీకరణ చేసేందుకు భాజపా సిద్ధమైంది. ఏర్పాట్లపై వివిధ జిల్లాల నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమావేశమై చర్చించారు. 

Updated : 05 Nov 2022 18:31 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. కనీసం లక్షమందికి తగ్గకుండా బహిరంగసభను విజయవంతం చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, జనసమీకరణపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల నేతలతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ప్రధానికి ఘన స్వాగతం పలికేలా తెలంగాణ అంతటా వివిధ రూపాల్లో అలంకరణ చేయాలని, అన్ని నియోజకవర్గాల రైతులు, కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలని సంజయ్‌ పేర్కొన్నారు. ప్రధానంగా రూ.6,120 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ద్వారా తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారత రైతులందరికీ కొరత లేకుండా ఎరువులను సరఫరా చేయబోతున్నారని అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశానికి బండి సంజయ్‌తో పాటు ఎంపీ సోయం బాపూరావు, ఈటల రాజేందర్‌, జి.వివేక్‌, జి.విజయరామారావు, సుద్దాల దేవయ్య, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని