ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి

ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 30 Apr 2024 06:20 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజల ఆస్తుల్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికే ఈ ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం భూ వివాదాల పరిష్కారానికి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్ల(టీఆర్‌వో)ను నియమిస్తారు. టీఆర్‌వోగా ఏ వ్యక్తినైనా నియమించుకోవచ్చని చట్టం చెబుతోంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులుగా, వివిధ కార్పొరేషన్‌లకు ఛైర్మన్లుగా అర్హత లేని వారిని నియమించారు. కేవలం రాజకీయ కారణాలతో ఈ నియామకాలు జరిగాయి. రేపు వైకాపా వాళ్లకు అనుకూలంగా ఉండేవారిని, వాళ్లు చెప్పినట్టు వినేవారిని టీఆర్‌వోల్ని చేస్తే...ప్రజలు, ప్రతిపక్షాల ఆస్తులకు రక్షణ ఉంటుందా?’’ అని జీవీ రెడ్డి మండిపడ్డారు.

ఐదేళ్లలో రూ.8.25 లక్షల కోట్ల దోపిడీ: కనకమేడల

ఈనాడు, దిల్లీ: జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.8.25 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని తెదేపా జాతీయ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. మద్యం, అసైన్డ్‌భూములు, టీడీఆర్‌బాండ్లు, విశాఖ భూములు, ఇసుక, ఎర్రచందనం, గ్రావెల్‌, గంజాయి, డ్రగ్స్‌, ప్రభుత్వ కొనుగోళ్లలో కమీషన్లపేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. ఆయన సోమవారం దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని