Ponguleti: ఖమ్మం జిల్లాకు భాజపా ముఖ్యనేతలు.. పొంగులేటి నిర్ణయంపై ఉత్కంఠ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పొంగులేటిని కమలం గూటికి తీసుకొచ్చేందుకు ఆపార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated : 04 May 2023 17:17 IST

ఖమ్మం: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈమేరకు భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం ఖమ్మం వచ్చి  పొంగులేటితో భేటీ అయింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితో గురువారం భేటీ అయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుకూడా పొంగులేటితో పాటు చర్చల్లో పాల్గొన్నారు.

వాస్తవానికి భారాస నుంచి బహిష్కరణకు గురైన తర్వాత భాజపాలోకి రావాలని ఈటల రాజేందర్‌ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపీ పలుమార్లు వ్యాఖ్యానించారు. భారాసను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా.. కేసీఆర్‌ను సీఎం కాకుండా చేసే పార్టీలోకే వెళతానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి భారాస అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేశారు. మరికొద్దిరోజుల్లోనే ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధమవుతున్నారు. ఈలోగా భాజపా ముఖ్యనేతలు పొంగులేటితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవాళ మధ్యాహ్నం నుంచి పొంగులేటి నివాసంలో భాజపా నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. భాజపాలో పొంగులేటికి ఇచ్చే ప్రాధాన్యతపై ఈటల స్పష్టంగా వివరించినట్టు సమాచారం. ఈటల నేతృత్వంలోని భాజపా ముఖ్యనేతలతో పాటు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు మాత్రమే చర్చల్లో పాల్గొన్నారు. గంటసేపటి తర్వాత పొంగులేటి గతంలోనే ప్రకటించిన ఇల్లందు అభ్యర్థి కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా అభ్యర్థిగా ప్రకటించిన విజయాభాయిని చర్చల్లోకి పిలిచారు. సెల్‌ఫోన్లను కూడా అనుమతించకుండా దాదాపు రెండున్నర గంటలకు పైగా చర్చిస్తున్నారు. ఈటల రాజేందర్‌ ఇచ్చిన హామీలపై పొంగులేటి స్పందన మాత్రం ఇంకా రాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని