Kishan Reddy: కేసీఆర్‌ పాలనలో పేపర్లపైనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు: కిషన్‌రెడ్డి

భారాస ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

Updated : 12 Aug 2023 14:29 IST

హైదరాబాద్‌: భారాస ప్రభుత్వానికి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరా పార్కు వద్ద భాజపా మహా ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు పేపర్లపైనే ఉంటాయని, భూమి మీద ఉండవని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2017లో సీఎం కేసీఆర్‌ అన్నారని గుర్తుచేశారు. 

‘‘ప్రగతిభవన్‌ను 4 నెలల్లో, సచివాలయాన్ని 8 నెలల్లో కట్టుకున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. పేదలకు ఇళ్లు కడితే.. కేంద్రం వాటా తీసుకొచ్చే బాధ్యత నాది. రాష్ట్ర సంపదను భారాస నేతలు దోచుకుంటున్నారు. దళితబంధు పేరుతో సీఎం దళితులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను దగా చేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ వస్తేనే పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు వస్తాయి. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పుడూ ఇళ్లు రావు. ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరిట మరోసారి కేసీఆర్‌ గారడీ చేస్తున్నారు’’ అని కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని