Kejriwal: ఆప్‌ని చూసి భయపడే.. ‘ఫ్రీ..ఫ్రీ’ అంటున్నారు!

ఆమ్‌ ఆద్మీ పార్టీని చూసి భాజపాకు భయం పట్టుకుందనీ.. అందుకే ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ అక్కడి ప్రజలకు ఉచితాలు.....

Published : 24 Apr 2022 01:29 IST

ధర్మశాల: ఆమ్‌ ఆద్మీ పార్టీని చూసి భాజపాకు భయం పట్టుకుందనీ.. అందుకే ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ అక్కడి ప్రజలకు ఉచితాలు ప్రకటించారని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ధర్మశాల సమీపంలోని చంబిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భాజపాపై మండిపడ్డారు. సీఎం ఠాకూర్‌ 125 యూనిట్ల వరకు ప్రజలు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం ఠాకూర్‌కు అలాంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ చీవాట్లు పెట్టారన్నారు. ప్రజలకు నిజంగా ఉపశమనం కల్పించాలని భాజపా సీరియస్‌గా అనుకుంటే ఆ పార్టీ పాలిత రాష్ట్రాలైన హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి చోట్ల కూడా ఇలాంటివి ప్రకటించవచ్చు కదా అన్నారు. 

డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న వేళ హిమాచల్‌ ప్రదేశ్ సీఎం జైంరా ఠాకూర్‌ ఇటీవల మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో 50శాతం ఛార్జీల్లో రాయితీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి బిల్లులు రద్దు.. 125 యూనిట్ల వరకు అందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించిన కేజ్రీవాల్‌ అక్కడ పాఠశాలల పరిస్థితిపై ధ్వజమెత్తారు. ‘‘ఒక్కసారి మీ సీఎంతో కలిసి దిల్లీకి వచ్చి చూడండి. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 99.7శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ అభివృద్ధి చూసి ఈ ఏడాది ఏకంగా 4లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. గత ఏడేళ్లుగా అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రయివేటు స్కూళ్లను నియంత్రిస్తున్నాం. దిల్లీలో మా ప్రభుత్వం ఆస్పత్రులు, ఉచిత వైద్య సదపాయాల్ని అందరికీ కల్పిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా అలాంటి వసతులు కల్పించే నిజాయతీ కలిగిన ప్రభుత్వం రావాలనుకుంటే ఆప్‌కు ఓటేయండి. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 30 ఏళ్లు పాలించింది.. భాజపా 17 ఏళ్లుగా పాలిస్తోంది. మాకు ఒక్క ఐదేళ్లు ఇవ్వండి. ఆ తర్వాత మళ్లీ మేం ఓట్లు అడగం. మా అభివృద్ధి చూసే జనమే ఓటు వేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని