జగన్‌.. ప్రజల జీవితాలతో ఆడుకొనే జలగ.. ఈ ఎమ్మెల్యే ‘మహా ముదురు’: చంద్రబాబు ఫైర్‌

అధికార అండతో వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుతింటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Updated : 05 Apr 2024 21:07 IST

Chandrababu Speech| నరసాపురం: అధికార అండతో వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుతింటున్నారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) మండిపడ్డారు. జే బ్రాండ్‌ మద్యం, గంజాయి, డ్రగ్స్‌ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. జగన్‌.. ప్రజల జీవితాలతో ఆడుకొనే ఓ జలగ అన్నారు. శుక్రవారం సాయంత్రం నరసాపురంలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ప్రసంగించిన చంద్రబాబు.. వైకాపా ఐదేళ్ల పాలన తీరుపై నిప్పులు చెరిగారు.

శవరాజకీయం వైకాపా డీఎన్‌ఏయేలోనే ఉంది..

‘‘గత ఎన్నికల్లో బాబాయిని చంపి ఓట్లు అడిగారు. వైకాపాకు జగన్‌ గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి. వైకాపా ప్రభుత్వం రైతులను దగా చేసింది. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్లు అప్పుల కుప్ప చేశారు. ప్రజల నెత్తిన అప్పుల కుంపటి ఉంది. వైకాపా డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉంది. తండ్రి లేని బిడ్డ అని గతంలో జగన్‌ సానుభూతి పొందారు. కిరాణా దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతోంది. దీన్ని అమ్మేదీ వైకాపా నేతలే. జగన్‌ పాలనలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయి. గ్రీన్‌ ట్యాక్స్‌ వల్ల ఆటో మొబైల్‌ రంగం దివాళా తీసింది. రాష్ట్రంలో బాగుపడింది జగన్‌ ఒక్కడే’’ అన్నారు.

పవన్‌ ఆకాంక్ష  అదే..

కూటమిగా పోటీ చేస్తోన్న మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. రాష్ట్రాన్ని బాగు చేయడమే కూటమి అజెండా. ప్రజల జీవితాల్లో వెలుగు తేవడమే మా అజెండా.  తెదేపా హయాంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారుచేశాం. కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్‌ అమలుచేశాం. దేశంలో ఆక్వా రంగాన్ని నంబర్‌ వన్‌గా నిలిపాం. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతులకు రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. అన్నదాతను ఆదుకొంటాం.. రైతును రాజుని చేస్తాం. వైకాపా విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్‌ ఆకాంక్ష. మోదీ సారథ్యంలోనే భారత్‌ నంబర్‌వన్‌గా తయారవుతుంది. భారత్‌ను అగ్రగామిగా మార్చేందుకు మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. 2047 నాటికి భారత్‌ నంబర్‌వన్‌గా తయారవుతుంది. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. రాష్ట్రంలో 160 అసెంబ్లీ 24 పార్లమెంటు స్థానాలు గెలవాలి. సంపద సృష్టించి ఆదాయం పెంచి పేదలకు పంచుతాం. పిల్లలను బాగా చదివిస్తేనే ప్రపంచాన్ని జయిస్తారు. తెదేపా వచ్చాక ఆడబిడ్డలకు 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం.

ఆ ఎమ్మెల్యే మహాముదురు..

‘మీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌ రాజు..  మహాముదురు. మామూలు ముదురు కాదు. సర్వం దోచేసిన మహాముదురు. ఏటిగట్టు పనులు నాసిరకం చేశాడా, లేదా? కొట్టుకొనిపోయాయా, లేదా? మెడికల్‌ కాలేజీ వస్తుందని నమ్మించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. కాలేజీ వచ్చిందా? అక్రమ ఇసుక రవాణాతో కనీసం ఒక రూ.30 కోట్లు కొట్టేశాడు.. మహాముదురు. లే అవుట్‌ వేయాలంటే ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. జగన్‌మోహన్‌ రెడ్డీ.. నువ్విచ్చిన చనువు.. నువ్వు నేర్పిన విద్య. ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారం ప్రజల ఆస్తులను మేసిన ప్రతీ వ్యక్తినుంచి కక్కించే బాధ్యత మాది’’ అని నరసాపురం ప్రజలతో చంద్రబాబు అన్నారు.

మీ త్యాగం వృథా కాదు..

ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతి, నిజాయతీతో పార్టీ జెండా మోసినవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చినా జెండాలు మోసిన మా కార్యకర్తల్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. మీ త్యాగం వృథా కాదు. నేను అండగా ఉంటాను. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు మనవే వస్తాయి. అందరికీ తగిన గుర్తింపు ఉంటుంది. న్యాయం చేసే బాధ్యత మాది’’ అని పార్టీశ్రేణుల్లో భరోసా నింపారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని