Chandrababu: వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు: చంద్రబాబు

ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. పూర్వవైభవం రావాలనే తెదేపా-జనసేన-భాజపా కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Updated : 04 Apr 2024 16:09 IST

కొత్తపేట: ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. పూర్వవైభవం రావాలనే తెదేపా-జనసేన-భాజపా కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. కొత్తపేటలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల జగన్‌ మాట్లాడుతూ.. నన్ను పశుపతి అని విమర్శించారు.  దానికి అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడు. అందుకే నేను శివుడి అవతారమెత్తాను. విషాన్ని గొంతులో పెట్టుకొని శివుడు ప్రపంచాన్ని కాపాడితే.. నన్ను, నా కుటుంబాన్ని, పవన్‌ కల్యాణ్‌ను ఎంత ఇబ్బంది పెట్టినా, వేధించినా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భరించాం.

వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు

ప్రశాంతతకు మారుపేరు కోనసీమ.. ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా? కానీ, ఇప్పుడు రాష్ట్రమంతా ఎక్కడా చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే జరుగుతున్నాయి. మద్యం నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్‌ అన్నారు. ఆ పని చేశారా? మద్య నిషేధం చేయకపోతే వైకాపాకు ఓట్లు అడిగే హక్కు లేదు. బాబాయ్‌ను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్‌. అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వారు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. వాలంటీర్లంతా తటస్థంగా ఉండాలి. వారికి న్యాయం చేస్తాం.

మాదిగ వర్గానికి ఒక ఎమ్మెల్సీ

ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్లు ఇవ్వకుండా చేశారు. అధికారులు ఒక్క నెల కూడా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వలేరా? పింఛను డబ్బులు వచ్చే వరకు వృద్ధులు, దివ్యాంగులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలి. వైకాపా హయాంలో వ్యవసాయం, నీటిపారుదల, ఆక్వా రంగాలు కుప్పకూలాయి. వాటిని కాపాడే బాధ్యత తీసుకుంటాం. అధికారంలోకి వచ్చాక ఎస్సీల కోసం సబ్‌ప్లాన్‌ అమలు చేసి వృద్ధిలోకి తీసుకొస్తాం. మాదిగ వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తాం’’అని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని