CM Jagan: 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా?: జగన్‌ సవాల్‌

ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం తమకు ఉందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Updated : 28 Feb 2023 15:32 IST

తెనాలి: ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం తమకు ఉందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడికి 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా? అని ఈ సందర్భంగా ఆయన సవాల్‌ విసిరారు. తమది పేదల ప్రభుత్వమని.. చంద్రబాబుది పెత్తందారీ పార్టీ అని జగన్‌ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ‘వైఎస్సార్‌ రైతుభరోసా’ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిలో 98.5 శాతం హామీలను అమలు చేశామని జగన్‌ చెప్పారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తిరుగుతున్నారన్నారు.  

‘‘వచ్చే ఎన్నికల్లో కరవుతో ఫ్రెండ్‌షిప్‌ ఉన్న చంద్రబాబు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగనుంది. ఆ యుద్ధం కులాల మధ్యకాదు.. పేదలు, పెత్తందార్ల మధ్య. పొరపాటు జరిగితే రాజకీయాల్లో ఇచ్చిన మాటపై నిలబటం అనేదానికి అర్థమే లేకుండా పోతుంది. మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడు కాదు అనే పరిస్థితి రావాలి. అందుకే ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలు చేశామని గర్వంగా చెబుతున్నా. మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండాలని మాత్రమే కోరుతున్నా. అన్నీ గమనించి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేదే ప్రామాణికంగా తీసుకోండి’’ అని జగన్‌ కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని