CM KCR: ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై దాడి.. నాపై జరిగినట్లుగానే భావిస్తా: సీఎం కేసీఆర్‌

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు మాట్లాడారు.

Updated : 30 Oct 2023 18:52 IST

బాన్సువాడ: మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు మాట్లాడారు.

‘‘మనం సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయి. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పింది. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కత్తులతో మా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి. తస్మాత్‌ జాగ్రత్త!

పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ హింసకు దిగలేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచాం. చేతనైనకాడికి సేవ చేశాం. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. మా సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోం. ఇవాళ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్‌ మీద జరిగిన దాడి నాపై జరిగిన దాడిగానే భావిస్తా. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోం. మేం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. ప్రజలకు ఎలా సేవ చేయాలనే ఆలోచనల్లో మేముంటే.. మీరు ఇలా దుర్మార్గమైన పనుల్లో ఉన్నారు. ఇది రాజకీయమా?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. అంతకుముందు మంత్రి హరీశ్‌ రావుకు ఫోన్‌ చేసి ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు.

నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో..

‘‘పదేళ్లుగా రాష్ట్రంలో పేదలు, అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం. రాష్ట్రంలో కరవు లేదు.. కర్ఫ్యూ లేదు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు నారాయణఖేడ్ రావాలంటే భయపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్, జహీరాబాద్‌లకు నీరు ఇస్తాం. గతంలో నారాయణఖేడ్ ప్రాతంలో తాగునీటికీ ఇబ్బందులు ఉండేవి. భూపాల్ రెడ్డిని మళ్లీ గెలిపించండి.. నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం ఆగం కావొద్దు. తెలంగాణ రాకముందు ఎలా ఉంది అభివృద్ధి.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలి. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తాం’’ అని కేసీఆర్ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని