Harish Rawat: ఇక చాలు అనిపిస్తోంది..! హరీశ్ రావత్‌ ట్విటర్‌ బాంబ్.. కాంగ్రెస్‌కు షాక్

ఓ వైపు జి-23 నేతల అసమ్మతి వ్యాఖ్యలు.. మరోవైపు వరుసగా పార్టీని వీడుతున్న సీనియర్లతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో సమస్య మొదలైంది. గాంధీల కుటుంబానికి

Published : 23 Dec 2021 01:22 IST

దేహ్రాదూన్‌: ఓ వైపు జి-23 నేతల అసమ్మతి వ్యాఖ్యలు.. మరోవైపు వరుసగా పార్టీని వీడుతున్న సీనియర్లతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో సమస్య మొదలైంది. గాంధీల కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడు, పార్టీలో ట్రబుల్‌షూటర్‌గా పేరున్న సీనియర్‌ నాయకుడు హరీశ్ రావత్‌.. కాంగ్రెస్‌ అధిష్ఠానంపై బహిరంగంగానే అసంతృప్తి గళం వినిపించారు. హై కమాండ్‌ నుంచి తనకు సరైన సహకారం లభించడం లేదంటూ వరుస ట్వీట్లలో ఆరోపించారు. 

‘‘ఇది వింతగా అనిపిస్తోంది కదూ..! ఎన్నికలనే మహా సముద్రంలో నేను ఈదుతున్నాను. ఇలాంటి సమయంలో సంస్థ(పార్టీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి) నాకు అండగా ఉండాల్సింది మాని.. ప్రతికూల పాత్ర పోషిస్తోంది. అధికారంతో కొందరు ఇక్కడ మొనళ్లను(మోసగాళ్లను) వదిలిపెట్టారు. పెద్దల ఆదేశాలతో నేను ఈ సముద్రంలో ఈదుతుంటే, వాళ్ల నామినీలు మాత్రం నా కాళ్లు, చేతులు కట్టేయాలని చూస్తున్నారు. ఇదంతా చూస్తూ నా మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. హరీశ్ రావత్‌ ఇక చాలు..! చాలా కాలం నుంచి ఈదుతున్నావ్‌.. ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది.. అని నా అంతరాత్మ చెబుతున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఇదే డైలమాలో ఉన్నాను. కొత్త సంవత్సరం నాకో కొత్త మార్గం చూపిస్తుందని ఆశిస్తున్నా’’ అని రావత్‌ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. 

పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారంలో రావత్‌, పార్టీ హైకమాండ్‌కు మధ్య దూరం పెరిగింది. పంజాబ్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రావత్‌.. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీంద్‌ సింగ్‌, ఆయన ప్రత్యర్థి నవజోత్‌ సింగ్ సిద్ధు మధ్య సమన్వయం తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో అధిష్ఠానం ఆయనను ఆ పదవి నుంచి తప్పించింది. 

అయితే, మరికొద్ది నెలల్లో ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌కు ఇది ప్రతికూల పరిణామమే అని చెప్పాలి. ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌లో రావత్‌ అత్యంత కీలక నేత. గతంలో 2014 నుంచి 2017 వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతుకుముందు ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని