Andhra News: సీఎం జగన్‌.. అవగాహన లేని మంత్రులతో జాతికి ద్రోహం చేయొద్దు: దేవినేని

రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్‌లో కాంట్రాక్టర్ లేకుండా చేశారని ఏపీ సీఎం జగన్‌పై తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

Updated : 23 Apr 2022 06:06 IST

అమరావతి: రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్‌లో కాంట్రాక్టర్ లేకుండా చేశారని ఏపీ సీఎం జగన్‌పై తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ అసమర్థతకు తెలుగుజాతి మూల్యం చెల్లించుకుంటోందని ఆక్షేపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు.

‘‘నాడు ప్రతి సోమవారం పోలవరంపై చంద్రబాబు సమీక్షించారు.తెదేపా నేత చంద్రబాబు దాదాపు 35 సార్లు పోలవరం వెళ్లి పనులు పరిగెత్తించారు. 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ పనులూ పోలవరమంత వేగంగా జరగలేదు. నాటి కేంద్ర మంత్రి గడ్కరీ రెండు సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి వారం ప్రాజెక్టు పనుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవహార శైలితో ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కమీషన్ల కక్కుర్తి కోసం చేసిన నిర్వాకం వల్లే డయాఫ్రమ్‌ వాల్ వద్ద నష్టం జరిగింది. అయితే డయాఫ్రమ్‌ వాల్‌కు ఎప్పుడు నష్టం జరిగిందనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియకుండా పోయింది. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి, జరిగిన నష్టంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. బాధ్యతాయుతమైన జలవనరుల శాఖపై ఏదేదో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబుని ఎవరికైనా చూపించండి. అవగాహన లేని మంత్రులతో జాతికి, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దు’’ అని దేవినేని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని