Lalu Prasad Yadav: నీతీశ్‌ కోసం ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి: లాలూ ఆసక్తికర వ్యాఖ్యలు

బిహార్‌లో మహా కూటమి అధికారం కోల్పోయిన కొన్ని వారాల తర్వాత ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 16 Feb 2024 20:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ పాత మిత్రుడు నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) కోసం ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) వ్యాఖ్యానించారు. జేడీయూ వైదొలగడంతో మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలిన కొన్ని వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ నిన్న బిహార్‌ అసెంబ్లీలో ఎదురుపడ్డారు. ఈసందర్భంగా పలకరించుకొని ఆత్మీయంగా మాట్లాడుకోవడం విలేకర్లను ఆకర్షించింది. 

ఈ విషయంపై పట్నాలో లాలూని విలేకర్లు ప్రశ్నించారు. ఆయన కుమారుడు తేజస్వీని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన నీతీశ్‌తో ఇంకా సయోధ్యకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. దీనికి లాలూ స్పందిస్తూ ‘‘ ఆయన్ను రానివ్వండి.. అప్పుడు చూద్దాం’’ అని సమాధానం ఇచ్చారు. అయితే నీతీశ్‌కు ద్వారాలు తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా లాలూ మాట్లాడుతూ రానున్న ఎన్నికల తర్వాత ప్రధాని మోదీని పదవి నుంచి దించుతామని విశ్వాసం వ్యక్తంచేశారు.  రాహుల్‌గాంధీలో ఎటువంటి లోపం లేదని.. ప్రధాని పదవికి అర్హుడని పేర్కొన్నారు. 

మరోవైపు లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వీ మాత్రం నీతీశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సాసారమ్‌లో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఆయన మాట్లాడుతూ బిహార్‌ సీఎం ఎవరి మాట వినే స్థితిలో లేరన్నారు. ‘‘మీ అందరికీ మన సీఎం గురించి తెలుసు. ఆయన ఎవరి మాటా వినాలనుకోరు. ప్రాణాలు పోయినా భాజపాతో కలవను అనేవారు. దీంతో 2024లో భాజపాను ఓడించేందుకే.. మేం త్యాగాలు చేసి నీతీశ్‌తో ఉందామనుకొన్నాం. ఈ క్రమంలోనే ఓ వృద్ధ ముఖ్యమంత్రిని నియమించాము’’ అని అన్నారు. 

ఎన్నికల ముందు స్తంభించిన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు.. మాకెన్‌ తీవ్ర ఆరోపణలు

ఆర్జేడీ చీఫ్‌ వ్యాఖ్యలపై జేడీయూ అధికారిక ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘ద్వారాలు తెరిచే ఉన్నాయని లాలూ అన్నారు. కానీ, ఆయన ఓ విషయం తెలుసుకోవాలి. వాటికి ప్రఖ్యాత అలీగఢ్‌ తాళాలు వేసేశారు. ఆర్జేడీ మాతో అధికారం పంచుకొన్న ప్రతిసారీ అవినీతికి పాల్పడింది. మళ్లీ వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు