Nitish Kumar: ‘ఇండియా’ కూటమిలోకి మరికొన్ని పార్టీలు: నీతీశ్‌

Nitish kumar: బిహార్‌ సీఎం, జేడీయూ చీఫ్‌ నీతీశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 31 నుంచి రెండు రోజుల పాటు ముంబయిలో జరిగే ‘ఇండియా’ కూటమి భేటీకి మరికొన్ని కొత్త పార్టీలు చేరే అవకాశం ఉందన్నారు.

Updated : 27 Aug 2023 15:10 IST

పట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే(NDA) ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘ఇండియా’(INDIA)లోకి మరికొన్ని పార్టీలు చేరే అవకాశం ఉందని బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌(Nitish Kumar) అన్నారు. త్వరలో ముంబయిలో జరగనున్న సమావేశానికి ఆ పార్టీలు వస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నీతీశ్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. విపక్ష పార్టీల నేతలతో తొలి భేటీని పట్నాలో నిర్వహించడం ద్వారా కీలక చొరవను ప్రదర్శించిన ఆయన..  ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1వ తేదీల్లో ముంబయిలో జరగనున్న ‘ఇండియా’ కూటమి భేటీకి హాజరు కాబోయే కొత్త పార్టీలు ఏంటనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఆదివారం పట్నాలో విలేకర్లతో మాట్లాడారు. 

ఈసారి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌..: అశోక్‌ గహ్లోత్‌

‘‘ముంబయి జరిగే భేటీలో సీట్ల పంపకంతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తాం.  మరికొన్ని రాజకీయ పార్టీలు మా కూటమిలో కలవబోతున్నాయి. ఎన్నికల లోపు సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నా. ఆ దిశగానే పనిచేస్తున్నా. అంతేతప్ప నాకు ఎలాంటి కోరిక లేదు’’ అని నీతీశ్‌ వ్యాఖ్యానించారు.  భాజపాకు వ్యతిరేకంగా ఇప్పటికే 26 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కూటమి రెండు పర్యాయాలు భేటీ అయింది.  జూన్‌ 23న పట్నాలో తొలి భేటీ జరగ్గా.. జులై 17-18 తేదీల్లో బెంగళూరులో రెండో భేటీ నిర్వహించారు. ఈసారి మహారాష్ట్రలోని ముంబయిలో జరిగే భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని