రేపటి శాసనసభ భేటీపై తెదేపా కీలక నిర్ణయం

రేపు జరిగే శాసనసభ సమావేశంలో పాల్గొనకూడదని తెదేపా నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Updated : 26 Jan 2020 16:51 IST

అమరావతి: రేపు జరిగే శాసనసభ భేటీకి హాజరయ్యే అంశంలో తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీడీఎల్పీ భేటీలో నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే రేపటి సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కష్టకాలంలో అండగా ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుందని.. అధికార పార్టీ ప్రలోభాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని చంద్రబాబు నేతలతో చెప్పినట్లు సమాచారం. టీడీఎల్పీ భేటీ సందర్భంగా తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ప్రలోభాలకు తలవంచక పోవడం వల్లే మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని వాళ్లు గౌరవించడం లేదన్నారు. సంబంధం లేని మండలి గురించి శాసనసభలో చర్చించడం అప్రజాస్వామికమని.. ఆ చర్చలో పాల్గొనాల్సిన అవసరం తమ సభ్యులకు లేదని చెప్పారు. అందుకే రేపు శాసనసభకు వెళ్లకూడదని నిర్ణయించామని అర్జునుడు తెలిపారు. 

రద్దుపై రేపే సభలో తీర్మానం?

మరోవైపు మండలి రద్దుపై శాసనసభలో ప్రభుత్వం రేపు తీర్మానం ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘మండలి అవసరమా?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్యలు రద్దుకు సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు జరిగే కేబినెట్‌ భేటీలో మండలి రద్దుకు ఆమోదం తెలిపి ఆ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత సభలో ఆమోదం పొందిన అనంతరం పార్లమెంట్‌కు పంపి మండలి రద్దు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి..

టీడీఎల్పీ సమావేశానికి 5 ఎమ్మెల్సీల గైర్హాజరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని