
కమల్‌నాథ్ ‘పరీక్ష’కు మరింత గడువు
26వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంక్షోభంలో కూరుకుపోయిన కమల్‌నాథ్ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. శాసనసభ సమావేశాలు వాయిదా పడటంతో నేడు ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవట్లేదు. ఆ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ఎమ్మెల్యేల రాజీనామాలపై అధికార, ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బలపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే స్పీకర్ సభను వాయిదా వేశారు. సమావేశాలను మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఎన్.పి. ప్రజాపతి సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ఆదేశాలను పక్కనబెట్టి స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు స్పీకర్ నిర్ణయంతో కమల్‌నాథ్ సర్కార్ తన బలాన్ని నిరూపించుకునేందుకు మరింత గడువు లభించినట్లయింది.
నిమిషంలో ప్రసంగం ముగించిన గవర్నర్..
రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని గవర్నర్ లాల్జీ టాండర్ గత శనివారం రాత్రి ఆదేశించారు. అయితే దీనిపై స్పీకర్ భిన్నంగా స్పందించారు. బలపరీక్షపై సోమవారమే రూలింగ్ ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగానే గవర్నర్ లాల్జీ టాండన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. కేవలం ఒక నిమిషం పాటు మాత్రమే మాట్లాడిన గవర్నర్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు రాజ్యాంగ సంప్రదాయాలను, చట్టాలను పాటించాలని, ప్రజాస్వామ్య, శాసనసభ మర్యాదను కాపాడాలని కోరారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.
గవర్నర్ జోక్యం సరికాదు..
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. గవర్నర్‌కు లేఖ రాశారు. స్పీకర్ విధివిధానాల్లో గవర్నర్ జోక్యం సరికాదని పేర్కొన్నారు. అంతేగాక, ఎమ్మెల్యేలు బెంగళూరులో నిర్బంధంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాతే బలపరీక్ష చేపట్టాలని, అప్పటిదాకా వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.