Byreddy Rajasekhar Reddy: రాయలసీమకు నమ్మక ద్రోహం: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాయలసీమ వాసులకు నమ్మక ద్రోహం చేస్తోందని, కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు రాలేదని, బెంచ్‌ రాలేదని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 19 Jan 2023 08:24 IST

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాయలసీమ వాసులకు నమ్మక ద్రోహం చేస్తోందని, కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు రాలేదని, బెంచ్‌ రాలేదని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తొలుత కర్నూలులోనే ఉన్న రాజధానిని తర్వాత హైదరాబాద్‌కు తరలించి, స్వార్థ రాజకీయ నాయకులు సీమకు తీరని ద్రోహం చేశారు. తుంగభద్ర జలాల్లో వాటా రాబట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో వలసలను అరికట్టలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రభుత్వంపై తిరగబడే సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ నెల 28న చలో సిద్ధేశ్వరం కార్యక్రమం చేపడతామని, తీగల వంతెనకు బదులుగా రోడ్‌ కమ్‌ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండు చేశారు. కృష్ణా బోర్డును విశాఖలో    పెట్టాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను చనిపోయిన తర్వాత తన     అస్థికలను రాయలసీమ నదుల్లో కలపాలని నిర్ణయించానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని