సంక్షిప్త వార్తలు(13)

ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్‌ కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్‌ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Updated : 01 Feb 2023 06:39 IST

ఆమ్‌ ఆద్మీకి ఇందిరాశోభన్‌ రాజీనామా

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్‌ కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్‌ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారాస ఖమ్మం సభకు  కేజ్రీవాల్‌ హాజరుకావడం, కేంద్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని పార్టీ బహిష్కరించినందున తాను వైదొలగుతున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  


అదానీ గ్రూప్‌ వ్యవహారం.. భాజపా సర్కార్‌దే బాధ్యత: సీపీఎం

ఈనాడు, హైదరాబాద్‌: అదానీ గ్రూప్‌ వ్యవహారమంతటికీ కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఆ గ్రూప్‌ డొల్లతనాన్ని బయటపెట్టి ఇలాంటి ఆర్థిక దోపిడీ పద్ధతులను అరికట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దిక్కుతోచని స్థితిలోనే అదానీ జాతీయవాదం పేరుతో తన డొల్లతనాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ పరిశోధన సంస్థ అదానీగ్రూప్‌ వ్యవహారం గుట్టురట్టు చేసిందన్నారు. ఈ సంస్థ ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సంబంధిత మంత్రి శాఖలన్నింటినీకలిపి ఉన్నతస్థాయి బృందంగా ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు. ఇప్పటికే 40 శాతం దేశ ఆర్థిక వ్యవస్థ జనాభాలో ఒక శాతంగా ఉన్న సంపన్నుల చేతుల్లో ఉందన్నారు.  


జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో.. విద్యుత్‌ ఏసీడీలపై కాంగ్రెస్‌ ఆందోళన

జగిత్యాల, న్యూస్‌టుడే: విద్యుత్‌ ఏసీడీలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జంబిగద్దె నుంచి కొత్త బస్టాండ్‌ మీదుగా విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారిపై 3 గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులపై విద్యుత్‌ వినియోగ ముందస్తు డిపాజిట్‌ వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేవలం ఉత్తర తెలంగాణ వినియోగదారులపైనే డిపాజిట్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాలో కోత విధిస్తున్నారన్నారు. సాగుకు కోత లేకుండా 13 గంటల విద్యుత్తు సరఫరా చేస్తామని, ఏసీడీల వసూలు విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎస్‌ఈ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


8, 9 తేదీల్లో పార్లమెంట్‌ వద్ద భారీ ప్రదర్శన: ఆర్‌.కృష్ణయ్య

కాచిగూడ, న్యూస్‌టుడే: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో పార్లమెంట్‌ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు భూపేశ్‌సాగర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చలో దిల్లీ గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలన్నారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు.


రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రధాని: చాడ

చిగురుమామిడి, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో భాజపా కుట్రలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతోందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి లోబడి ఉండాలని.. అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దన్నారు. గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు ఉండకూడదని, సమన్వయంతో ఇరువురు పనులు చేయాలన్నారు.


వివేకా కేసు నుంచి బయటపడేందుకే దిల్లీకి జగన్‌
తెదేపా నేత వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వివేకా హత్య కేసులో సీబీఐ బిగిస్తున్న ఉచ్చు నుంచి తనను, తన శ్రీమతి భారతిని కాపాడుకోడానికే సీఎం జగన్‌ దిల్లీ యాత్ర చేపట్టారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. సీబీఐ విచారణలో వాస్తవాలన్నీ బయటపడ్డాక చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య జరిగిన తర్వాత ఎన్ని నాటకాలు ఆడారు? వివేకా పోస్ట్‌మార్టం నివేదిక చూస్తే గొడ్డలిపోట్లకు ఎలా కట్టుకట్టారో తెలుస్తుంది. అవినాష్‌రెడ్డి ఫోన్‌ చేసిన ప్రతిసారీ నవీన్‌ ద్వారా ఆ ఫోన్‌ భారతికి వెళ్లింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు.


కాల్‌ డేటా వెలుగులోకి రాకుండా ఉండేందుకే: పయ్యావుల కేశవ్‌

‘వివేకా హత్యకేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా ముఖ్యమంత్రి జగన్‌ విశాఖ రాజధాని ప్రకటన చేశారు. అవినాష్‌రెడ్డి కాల్‌డేటా వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రాజధాని ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీలు పెండింగులో ఉండగా సీఎం ప్రకటన కోర్టుధిక్కరణే’ అని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.


రాజీనామా చేశాక మీ ఇష్టం
దేవినేని ఉమా

మైలవరం, న్యూస్‌టుడే: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక, కావాలంటే పులివెందులకైనా వెళ్లిపోవచ్చని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి దిల్లీలో చేసిన ప్రకటనపై ఆయన మంగళవారం మైలవరంలో విలేకర్లతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బాబాయి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ మండిపడ్డారు.


రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీఎం మాటలు: రఘురామ

ఈనాడు, దిల్లీ: రాజధాని అంశంపై న్యాయస్థానాలు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీఎం జగన్‌ మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యం అనుకోవాలా అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. వివేకా హత్యకేసులో తాజా పరిణామాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తాను విశాఖకు తరలి వెళుతున్నట్లు చెప్పాలన్నది ముఖ్యమంత్రి వ్యూహం అయి ఉంటుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.


సుప్రీంకోర్టును వెక్కిరించడమే
సీఎం ప్రకటనపై ఎంపీ జీవీఎల్‌ ధ్వజం

ఈనాడు, దిల్లీ: త్వరలో విశాఖపట్నం రాష్ట్ర రాజధాని కాబోతోందని సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టును వెక్కిరించడమేనని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ధ్వజమెత్తారు. ‘రాజధానిపై కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయనిలా చెప్పడం వెనక ఉద్దేశమేంటో స్పష్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందని చెప్పినట్లు రాశారు. కానీ వాస్తవంగా ముఖ్యమంత్రి మాటలు విశాఖపట్నం ఏకైక రాజధాని అవుతుందని చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలా మాట్లాడటం కోర్టును వెక్కిరించినట్లే’ అని వ్యాఖ్యానించారు.


వివేకా హత్య కేసు నుంచి దృష్టి మరల్చడానికే: సత్యకుమార్‌

వివేకానందరెడ్డి హత్యకేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే విశాఖ రాజధానిపై ఏపీ సీఎం జగన్‌ వివాదాస్పద ప్రకటన చేసినట్లు కనిపిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. సీఎం వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగానే తాను రాజధానిని తరలిస్తున్నట్లు చెప్పడాన్ని బట్టి.. రాజ్యాంగ వ్యవస్థలపై సీఎంకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.


కర్ణాటక ఎన్నికలపై ఆప్‌ గురి

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: ‘కర్ణాటక ఎన్నికలపై మా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారు’ అని దిల్లీ ఆప్‌ ఎమ్మెల్యే, విద్యావేత్త అతిశి మార్లేనా వెల్లడించారు. తమ పార్టీ ప్రకటించిన పథకాలను కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొట్టి... ఆప్‌ను తలపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బెంగళూరులో ఆప్‌ నేతలతో కలిసి ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలోనూ తమకు ప్రజలు మద్దతిస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పృథ్వీరెడ్డి, సీనియర్‌ నేతలు చంద్రు, బ్రిజేశ్‌ కాళప్ప, పూర్వ ఐపీఎస్‌ అధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


బళ్లారి నుంచి ‘గాలి’ భార్య పోటీ

ఈనాడు, బెంగళూరు: బళ్లారి నియోజకవర్గం నుంచి తన భార్య అరుణ లక్ష్మి పోటీ చేస్తారని కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్‌పీపీ) వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం గంగావతిలో పార్టీ తరఫున ఎన్నికల రథయాత్రను ప్రారంభించారు. తాను గంగావతి నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రణాళికను విడుదల చేశారు. ప్రస్తుతం బళ్లారి నియోజకవర్గానికి గాలి జనార్దనరెడ్డి సోదరుడు జి.సోమశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరో సోదరుడు జి.కరుణాకరరెడ్డి హరపనహళ్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరూ భాజపా నుంచే గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని