తెదేపా నేతపై తూటా
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి (70)పై ఆయన స్వగ్రామం అలవాలలోని ఇంట్లోనే హత్యాయత్నం జరిగింది.
పల్నాడు జిల్లా అలవాలలో ఘటన
తుపాకీ పేల్చిన వైకాపా క్రియాశీలక కార్యకర్త
బాలకోటిరెడ్డి పొట్టలోకి దూసుకుపోయిన బుల్లెట్
ఆర్నెల్లలోనే రెండుసార్లు హత్యాయత్నం
ఈనాడు, ఈనాడు డిజిటల్- అమరావతి, న్యూస్‌టుడే- రొంపిచర్ల: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి (70)పై ఆయన స్వగ్రామం అలవాలలోని ఇంట్లోనే హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నిద్రిస్తున్న ఆయనను ఓ వ్యక్తి తలుపుకొట్టి నిద్రలేపి మరీ తుపాకీతో కాల్చారు. తీవ్రగాయాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన వైకాపా క్రియాశీలక కార్యకర్త వంటిపులి వెంకటేశ్వర్లు అలియాస్ జగన్ ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సంఘటనాస్థలిలో రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగిందంటే..
‘బుధవారం రాత్రి మేం నిద్రకు ఉపక్రమించగానే నేను శివారెడ్డిని (బాలకోటిరెడ్డి తమ్ముడి కుమారుడు) అంటూ ఎవరో తలుపులు కొట్టారు. ఇద్దరం బయటకు రాగానే ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి కండువా చాటు నుంచి తుపాకీ తీసి బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపాడు. ఒక తూటా ఆయన కడుపులోకి దూసుకుపోయింది. నేను కేకలు పెట్టడంతో బంధువులు, చుట్టుపక్కలవారు వచ్చి ఆయన్ను నరసరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు’ అని ఆయన భార్య నాగేంద్రమ్మ చెప్పారు. తన భర్తపై కాల్పులు జరిపింది అలవాలకే చెందిన తమ బంధువు పమ్మి వెంకటేశ్వరరెడ్డి, అతని అనుచరుడు రాముడు అని ఆమె ఆరోపించారు. ఘటన రాత్రిపూట జరగడం, నిందితులు ముసుగులు ధరించి ఉండటంతో ఆమె గుర్తుపట్టి ఉండకపోవచ్చని.. కాల్పులు జరిపింది వంటిపులి వెంకటేశ్వర్లు అని పోలీసులు చెప్పారు. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని పల్నాడు ఎస్పీ, కలెక్టర్‌కు బాలకోటిరెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ హత్యాయత్నం జరిగిందని నాగేంద్రమ్మ ఆరోపించారు.
పాతకక్షల నేపథ్యంలోనే కాల్పులు: ఎస్పీ
రొంపిచర్ల మండల తెదేపా అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి, పమ్మి వెంకటేశ్వరరెడ్డి మధ్య గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలతోపాటు మనస్పర్థల వల్లే బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిగాయని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో పమ్మి వెంకటేశ్వరరెడ్డి, పులి అంజిరెడ్డి, వంటిపులి వెంకటేశ్వర్లు, పూజల రాములును నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘అలవాల పంచాయతీ ఎన్నికల్లో బాలకోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి కలిసి తెదేపా తరఫున సర్పంచి అభ్యర్థిని నిలిపారు. ఎన్నికల ఖర్చు వెంకటేశ్వరరెడ్డితో పెట్టించడంతో పాటు ఆయనకు గ్రామ పెత్తనం, ఎంపీటీసీ పదవి ఇప్పిస్తానని బాలకోటిరెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో నిరుడు జులై 19న ఉదయం నడకకు వెళ్లిన బాలకోటిరెడ్డిపై వెంకటేశ్వరరెడ్డి, మరో ఇద్దరు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను సబ్ జైలుకు పంపారు. అక్కడ వెంకటేశ్వరరెడ్డికి దొంగతనం కేసులో జైలుకొచ్చిన నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన పులి అంజిరెడ్డి పరిచయమయ్యాడు. సాయం చేయాలని వెంకటేశ్వరరెడ్డి కోరడంతో జైలు నుంచి బయటికి వచ్చాక అంజిరెడ్డి ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన వంటిపులి వెంకటేశ్వర్లు ద్వారా రాజస్థాన్‌లో రూ.60 వేలకు తుపాకీ కొన్నాడు. బుధవారం రాత్రి అంజిరెడ్డి, వెంకటేశ్వర్లు కలసి బాలకోటిరెడ్డి ఇంటికి వెళ్లి కాల్పులు జరిపారు. బాలకోటిరెడ్డి భార్య నాగేంద్రమ్మ ఇచ్చిన సమాచారం మేరకు వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాం. అతను ఇచ్చిన సమాచారం మేరకు నుదురుపాడు వద్ద ఉన్న పులి అంజిరెడ్డిని, వంటిపులి వెంకటేశ్వర్లును అరెస్టు చేసి, వారి దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నాం. వీరి ముగ్గురితోపాటు వెంకటేశ్వరెడ్డి అనుచరుడు పూజల రాములుపై 307తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు. రాజకీయ లబ్ధి కోసమే హత్యకు యత్నించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుగాని, ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు పేరు గానీ నాగేంద్రమ్మ ప్రస్తావించలేదని ఎస్పీ చెప్పారు.
ఖండించిన చంద్రబాబు
బాలకోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై స్థానిక పార్టీ నాయకులతో, చికిత్స చేస్తున్న డాక్టర్లతోనూ ఫోనులో మాట్లాడారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో ఆరోపించారు. గతంలో బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం చేసిన వెంకటేశ్వరరెడ్డికి ఎమ్మెల్యే ఆశ్రయమిచ్చారని మండిపడ్డారు. తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కూన రవికుమార్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాలకోటిరెడ్డిని పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ