అధికారులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

వెంకటగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అధికారులను భయపెట్టి కొంతమంది అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.

Published : 03 Feb 2023 04:46 IST

ఫోన్‌ ట్యాపింగ్‌పై నన్ను అడిగేవాళ్లెవరూ లేరు: ఆనం

నెల్లూరు (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: వెంకటగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అధికారులను భయపెట్టి కొంతమంది అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. రాపూరు ఎంపీపీ బాలకృష్ణారెడ్డి సారథ్యంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గురువారం ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం రామనారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్‌, జడ్పీటీసీ సభ్యులు ఏగ్రీవమైన మండలం రాపూరు అని, అలాంటి మండలంలోనూ రాజకీయ అనిశ్చితి నెలకొందని అన్నారు. తాము వైకాపాలో ఉన్నామా.. తీసేశారా.. తమ అధికారం ఏమిటని అడిగేందుకు వీరంతా వచ్చారని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను తీసేసే అధికారం ఎవరికీ లేదని, పదవులకు ఎలాంటి ఢోకా ఉండదని తాను చెప్పానన్నారు. ప్రస్తుతం వచ్చిన పార్టీ సమన్వయకర్త ఏ ఊరికీ వెళ్లి ఎవరినీ కలవడంలేదని.. బంగ్లాకు రమ్మని పిలుస్తున్నారని, రానివారిని తీసేస్తున్నారని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తనను పిలిచి అడిగేవారు లేరని, ఒకవేళ పిలిచినా వెళ్లి చేతులు కట్టుకుని నిలిచి సంజాయిషీ చెప్పే ఆలోచన లేదని స్పష్టంచేశారు. తనను రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారని.. శక్తి ఉంటే లేస్తానని, లేకుంటే కింద పడిపోతానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని