TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి

తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా సభ్యులు శాసనసభలో దాడులు చేయడమేగాక వారిపై తెదేపా వారే దాడికి పాల్పడినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రకాశం జిల్లా కొండపి శాసనసభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు.

Updated : 22 Mar 2023 07:13 IST

సాక్షి అబద్ధాల పుట్ట అనేందుకు ఇది నిదర్శనం  
ఆ పత్రిక ఛైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతిని సభకు పిలిపిస్తారా?
శాసనసభ వీడియోలను బహిరంగపరచాలి
కొండపి ఎమ్మెల్యే  ధ్వజం

మర్రిపూడి, న్యూస్‌టుడే: తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా సభ్యులు శాసనసభలో దాడులు చేయడమేగాక వారిపై తెదేపా వారే దాడికి పాల్పడినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రకాశం జిల్లా కొండపి శాసనసభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మర్రిపూడి మండలం జువ్వికుంటలో మంగళవారం ఆయన మాట్లాడారు. స్పీకర్‌పై తెదేపా శాసనసభ్యులు దాడి చేస్తున్నట్లు ‘సాక్షి’ పత్రికలో మంగళవారం ఫొటో ప్రచురించారని, అందులో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఉన్నట్లు ఇచ్చారని, అది అసత్యమన్నారు. సోమవారం నాటి సభకు భవానీ హాజరు కాలేదన్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేసిన వారి జాబితాలో ఆమె పేరు లేదని, అయినా పాత ఫొటోను ఉద్దేశపూర్వకంగానే సాక్షిలో ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సాక్షి అబద్ధాల పుట్ట అనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇప్పుడు ఎవరిని పిలిపించి మోకాళ్లపై కూర్చోబెడతారు? ఆ పత్రిక ఛైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతిని అసెంబ్లీకి పిలిపిస్తారా? అని ప్రశ్నించారు. తెదేపా వారు నిబద్ధత కలిగినవారని... రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులన్నారు. ‘సత్యమేవ జయతే’ అని సాక్షిలో రాసుకుంటూ అసత్య వార్తలు ఇస్తున్నారన్నారు. సభలో లేని ఎమ్మెల్యే భవానీ పేరు పెట్టి స్పీకర్‌పై దాడి చేసినట్లు ప్రచురించడం దారుణమని విమర్శించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై గళమెత్తి   ప్రశ్నిస్తున్నానన్న అక్కసుతో వైకాపా ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తనపై, తెదేపా సభ్యులపై దాడి చేశారని చెప్పారు. తాను అసభ్య పదజాలం వాడినట్లు రాశారని, రికార్డులు చూపాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో వీడియోలను ఎటువంటి ఎడిటింగ్‌ లేకుండా బహిరంగ పరచాలని.. తద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టత వస్తుందని, అప్పుడు మీరు ఏ శిక్ష వేసినా సిద్ధమేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని