దేశవ్యాప్తంగా ‘జన్‌ ఆందోళన్‌’

రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ సోమవారం నుంచి దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆయన నోరు నొక్కేసే ఉద్దేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి, అనర్హత వేటు వేయించిందని ఆరోపించింది.

Published : 25 Mar 2023 03:58 IST

రాహుల్‌పై అనర్హతను నిరసిస్తూ ఉద్యమానికి కాంగ్రెస్‌ నిర్ణయం
విపక్షాలతో ఐక్యంగా ముందుకు సాగుతామని వెల్లడి

దిల్లీ: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ సోమవారం నుంచి దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆయన నోరు నొక్కేసే ఉద్దేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి, అనర్హత వేటు వేయించిందని ఆరోపించింది. విపక్షాలతో ఐక్యంగా ముందుకు సాగుతామని స్పష్టంచేసింది. రాహుల్‌పై అనర్హత నిర్ణయం వెలువడగానే కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. ఈ అంశంపై అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించింది. ఈ భేటీలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు, ప్రియాంకా గాంధీ, కె.సి.వేణుగోపాల్‌, జైరామ్‌ రమేశ్‌, రాజీవ్‌ శుక్లా, సీనియర్‌ నేతలు చిదంబరం, ఆనంద్‌ శర్మ, అంబికా సోని, ముకుల్‌ వాస్నిక్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌పై అనర్హతను నిరసిస్తూ ‘జన్‌ ఆందోళన్‌’ నిర్వహించాలని నిర్ణయించారు. అదానీ వ్యవహారం సహా వివిధ అంశాలపై గళం విప్పినందుకే ఆయనపై కేంద్రం ఈ చర్య చేపట్టిందని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. భారత్‌ జోడో యాత్ర విజయవంతం కావడాన్ని మోదీ సర్కారు జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఈ అంశంపై విపక్ష పార్టీల మద్దతును స్వాగతిస్తున్నామని చెప్పారు. ‘‘ప్రతిపక్షాల ఐక్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లోని ఆయా పార్టీల నేతలతో ఖర్గే ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. ఇప్పుడు పార్లమెంటు వెలుపల కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర విభాగాలు నిరసన కార్యక్రమాలను చేపడతాయన్నారు.

త్వరలో అప్పీలు

రాహుల్‌పై అనర్హత అంశాన్ని త్వరలోనే పైకోర్టులో అప్పీలు చేస్తామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ స్పష్టంచేశారు. సూరత్‌ కోర్టు ఇచ్చిన 170 పేజీల తీర్పును పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని