Yuvagalam: అడ్డంకుల్నీ.. అవరోధాల్నీ అధిగమించి లోకేశ్‌ పాదయాత్ర

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర శుక్రవారానికి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటోంది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లాలో కుప్పంలో ప్రారంభమైన యాత్ర అభిమానుల కేరింతల మధ్య సాగుతోంది.

Updated : 21 Apr 2023 22:19 IST

నేడు 1,000 కి.మీ. మైలురాయికి
77 రోజుల్లో... 27 నియోజకవర్గాలు

ఈనాడు, కర్నూలు: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర శుక్రవారానికి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటోంది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లాలో కుప్పంలో ప్రారంభమైన యాత్ర అభిమానుల కేరింతల మధ్య సాగుతోంది. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్ని, ప్రత్యేకంగా యువతను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా లోకేశ్‌.. 400 రోజులపాటు, 4,000 కి.మీ. యాత్ర చేపట్టారు. ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అధికారులు, పోలీసులు అర్థంలేని నిబంధనలు, సాకులు చెబుతూ ఆటంకాలు కల్పించారు. 25 కేసులు నమోదు చేశారు. కానీ లోకేశ్‌ వాటన్నింటినీ ఎదుర్కొంటూ, పోలీసుల్ని సూటిగా నిలదీస్తూ, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ అరాచకాల్ని ఎండగడుతూ, తెదేపా అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా మేలు చేస్తుందో వివరిస్తూ ముందడుగు వేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమైన మొదట్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్నీ ప్రకటించారు. వివిధ సామాజిక వర్గాలవారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోకేశ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారానికి పాదయాత్ర చేపట్టి 77 రోజులవుతుంది. 27 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర పూర్తవుతుంది. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూశారు. ప్రచారరథం, మైక్‌, సౌండ్‌ సిస్టమ్‌, స్టూల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కొన్నిచోట్ల మాట్లాడేందుకు అనుమతి లేదని అభ్యంతరం చెప్పారు. వాహనాలను అడ్డుకున్నారు. కుప్పం నుంచి తంబళ్లపల్లె వరకు సగటున ప్రతి 20 కి.మీ.కు ఒక కేసు పెట్టారు. పాదయాత్రపై ఇప్పటి వరకు 25 పోలీసు కేసులు నమోదవగా, వాటిలో మూడు కేసులు లోకేశ్‌పైనే పెట్టారు. రహదారులపై మాట్లాడేందుకు అనుమతి లేదని చెప్పడంతో.. లోకేశ్‌ పొలాల్లో బహిరంగ సభలు నిర్వహించారు.

సమస్యలు వింటూ.. విజ్ఞప్తులు స్వీకరిస్తూ..

తనను కలసిన ప్రజలు చెబుతున్న సమస్యల్ని లోకేశ్‌  ఓపికగా వింటూ, తెదేపా అధికారంలోకి వచ్చాక వాటికి ఎలాంటి పరిష్కారం చూపిస్తామో వివరిస్తున్నారు. వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. ఆర్థికసాయం వంటివి అవసరమైనవారికి పార్టీ తరపున అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు 1,300 వినతిపత్రాలు అందాయి.

ప్రజాప్రతినిధుల అవినీతి చిట్టా..

లోకేశ్‌ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక బహిరంగసభ నిర్వహిస్తున్నారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యేల అవినీతి చిట్టా బయట పెడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరచిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, కె.శ్రీదేవి, గుమ్మనూరు జయరాంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెదేపా హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు, పూర్తి చేసిన ప్రాజెక్టులను పాదయాత్రలో భాగంగా సందర్శిస్తున్న లోకేశ్‌ వాటి ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ.. ముఖ్యమంత్రిని ఛాలెంజ్‌ చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మూతపడ్డ సంస్థలు, అన్న క్యాంటీన్ల ముందు సెల్ఫీలు దిగుతూ ఆయన చేస్తున్న విమర్శలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజూ పాదయాత్ర ప్రారంభమవడానికి ముందు ఒక గంటపాటు తనను కలిసేందుకు వచ్చిన 1,500 మందితో సెల్ఫీలు దిగుతున్నారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఒక ముఖ్య సమస్య పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. ఆవిషయాన్ని శిలాఫలకంలోనూ స్పష్టంగా పేర్కొంటున్నారు. లోకేశ్‌ పాదయాత్ర మొదలైన 77 రోజుల్లో.. మూడు రోజులే విరామం ఇచ్చారు. ఆహార నియమాలు, వ్యాయామం, యోగా, ధ్యానం, నిర్ణీత సమయం పాటు రాత్రివేళల్లో నిద్ర తదితర జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సాహంగా యాత్ర కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని