Raghunandan Rao: ఫోన్‌ నంబరు మార్చారెందుకు?మంత్రి నిరంజన్‌రెడ్డికి రఘునందన్‌రావు ప్రశ్న

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డికి మొదటి నుంచి ఉన్న మొబైల్‌ ఫోన్‌ నంబరును మార్చారని, దీని వెనుక ఆంతర్యమేమిటని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Updated : 25 Apr 2023 08:55 IST

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డికి మొదటి నుంచి ఉన్న మొబైల్‌ ఫోన్‌ నంబరును మార్చారని, దీని వెనుక ఆంతర్యమేమిటని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. పాత నంబరుతో చైనాకు చెందిన మో అనే వ్యక్తితో పలుమార్లు మాట్లాడారని, అతని ద్వారా అమెరికాలోని కొందరు వ్యక్తులకు ఫోన్లు చేయించారని ఆరోపించారు. ఫోన్‌ నంబరును ఉద్దేశపూర్వకంగా మార్చారా.. లావాదేవీలు బయటపడతాయని భయపడ్డారా అని ప్రశ్నించారు. ఈ అనుమానాలపై ఈడీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు ఎన్వీ సుభాష్‌, వి.సుధాకర్‌శర్మ, రాజయ్య యాదవ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. మంత్రి దత్తపుత్రుడు గౌడనాయక్‌ ఏ బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిపారు? భూములను నల్లధనంతో కొన్నారా? అనే అంశంపై విచారణ జరిపించాలని కోరుతూ ఐటీ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మంత్రి దత్తపుత్రుడు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌), పంచాయతీరాజ్‌శాఖ కాంట్రాక్టులు చేస్తున్నారని ఆరోపించారు. తాను లేవనెత్తిన సర్వే నంబర్లలో 60 గురించి మాత్రమే మంత్రి మాట్లాడారని.. 53, 54, 59లతోపాటు పలు సర్వే నంబర్ల గురించి మాట్లాడలేదన్నారు. వేరుసెనగ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు భూమి చదును కోసం రూ.40 లక్షలకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని.. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఈ పనులను దత్తపుత్రుడికి ఇచ్చారని రఘునందన్‌రావు ఆరోపించారు. మంత్రి ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నానని.. ఎప్పుడు పిలిచినా ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తానని చెప్పారు. మంత్రి రూ.4 కోట్లకు వ్యవసాయ క్షేత్రాన్ని ఇస్తానంటే వైట్‌ మనీ ఇచ్చి కొంటానన్నారు. దత్తపుత్రుడి భూమి పేరిట రుణాలు తీసుకోలేదని, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా జేసీబీలు, ఇటాచీలు తీసుకోలేదని, డ్రిప్‌ ఇరిగేషన్‌ రుణాలు తీసుకోలేదని మంత్రి చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని