Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్‌

పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం ఆందోళనలకు దారితీసింది. వైకాపా నాయకులు ఇటీవల పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మరికొందరు మోస్తున్నట్లు కార్టూన్‌ ఉండటం అభ్యంతరకరంగా ఉందని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మే 26న కలెక్టర్‌ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు.

Updated : 02 Jun 2023 06:54 IST

జనసేన జిల్లా అధ్యక్షుడి అరెస్టుతో ఉద్రిక్తం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం ఆందోళనలకు దారితీసింది. వైకాపా నాయకులు ఇటీవల పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మరికొందరు మోస్తున్నట్లు కార్టూన్‌ ఉండటం అభ్యంతరకరంగా ఉందని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మే 26న కలెక్టర్‌ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. పురపాలక, పోలీసు అధికారులకు వినతులు ఇచ్చారు. అయినా ఫ్లెక్సీలను తొలగించలేదు. మరోవైపు జనసేన ముద్రించిన ఫ్లెక్సీలను భీమవరంలో ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం గురువారం భీమవరంలోని తన కార్యాలయంలో గోవిందరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేన శ్రేణులు జిల్లా వ్యాప్తంగా తరలి వస్తారని భావించిన పోలీసులు గోవిందరావును ఆయన నివాసంలో గురువారం ఉదయం 5.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.

తనకు 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటంటూ తన ఇంటికి వచ్చిన సీఐలు, ఎస్‌ఐలను గోవిందరావు ప్రశ్నించారు. అయినా వినకుండా ఆయనను అదుపులోకి తీసుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గోవిందరావును తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినా వారిని తప్పించుకుని వాహనాన్ని పోనివ్వడంతో జన సైనికులు ద్విచక్రవాహనాలపై వెంబడించారు. ఆయనను పోడూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జనసేన పిలుపుతో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలూ జరిగాయి. మరోవైపు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పోడూరు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. నరసాపురం డీఎస్పీ మనోహరచారి, పాలకొల్లు గ్రామీణ సీఐ కె.శ్రీనివాస్‌లు గోవిందరావుతో మాట్లాడిన అనంతరం 10.45 గంటల సమయంలో విడిచిపెట్టారు. అక్రమ నిర్బంధాలు దారుణమని భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కొటికలపూడి గోవిందరావు నివాసానికి వెళ్లి ఆయన సంఘీభావం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని