Nara Lokesh: కాపు కార్పొరేషన్‌ నిర్వీర్యం

బలిజల అభ్యున్నతి కోసం తెదేపా విశేషంగా కృషిచేసిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గతంలో అమలుచేసిన రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని, జగన్‌ కక్ష సాధింపుతో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు.

Updated : 05 Jun 2023 06:16 IST

బలిజలపై జగన్‌ వేధింపులు
మైదుకూరులో నారా లోకేశ్‌ విమర్శ
త్వరలో రాయలసీమపై ప్రణాళిక విడుదల
ఇన్‌ఛార్జుల వ్యవస్థ ఉండదని స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్‌, కడప: బలిజల అభ్యున్నతి కోసం తెదేపా విశేషంగా కృషిచేసిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గతంలో అమలుచేసిన రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని, జగన్‌ కక్ష సాధింపుతో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బలిజలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తామని.. వారిని గెలిపించుకోవాలని కోరారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం మైదుకూరు నియోజకవర్గం భూమయ్యగారిపల్లె వద్ద బలిజ ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. బలిజలు జగన్‌ చేతిలో బాధితులుగా మారారని.. రాయలసీమలో బలిజలను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సొంత జిల్లా అంటే అభివృద్ధి చెందాలి.. అయితే కేవలం జయంతి, వర్ధంతులకు తప్ప జగన్‌కు కడప గుర్తురావట్లేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లు తెదేపాకు కట్టబెడితే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని తెలిపారు. లేదంటే కాలర్‌ పట్టుకుని తనను నిలదీయాలని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి తెదేపా 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే జగన్‌ మాత్రం.. మిథున్‌రెడ్డికి కట్టబెట్టి వంచించారని విమర్శించారు. బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించామని తెలిపారు. పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

7న కడపలో రాయలసీమ ప్రణాళిక విడుదల

రాయలసీమలో పాదయాత్ర నిర్వహించిన లోకేశ్‌.. ఇక్కడి ప్రజల కష్టాలను గుర్తించి.. పరిష్కారం దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తున్నారు. వ్యవసాయ, సాగు, తాగునీటి, పరిశ్రమలు, ఉద్యానపంటల సాగులో తీసుకురావాల్సిన మార్పులపై రాయలసీమ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. కడపలో జరిగే బహిరంగ సభలో ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో లోకేశ్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారంలో 5 రోజులు ప్రజల్లో ఉండాలని.. లేదంటే ప్రత్నామ్నాయం వెతుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయే వారికి భవిష్యత్తులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. పనితీరులో వెనకబడ్డవారిపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ రాయలసీమ ఇన్‌ఛార్జి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో సమావేశం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని