మైనారిటీలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తా

మైనారిటీలకు అండగా ఉంటానని, మీరు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

Updated : 09 Jun 2023 05:28 IST

హజ్‌ యాత్రికులతో మాజీ సీఎం చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే నరేంద్రను అడ్డుకున్న పోలీసులు

ఈనాడు, అమరావతి: మైనారిటీలకు అండగా ఉంటానని, మీరు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.145 కోట్లతో హజ్‌ హౌస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, దాని నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం కొనసాగించలేదని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం, మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు భారతదేశం గర్వపడే విధంగా హజ్‌హౌస్‌ను నిర్మించి మీ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నంబూరు మదర్సా నుంచి హజ్‌ యాత్రకు వెళుతున్నవారిని గురువారం రాత్రి ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ముంబయి, బెంగళూరు వెళ్లి హజ్‌యాత్రకు వెళ్లేవారు. ఆ పరిస్థితి లేకుండా నేరుగా హైదరాబాద్‌ నుంచి వెళ్లేలా అసెంబ్లీ ఎదురుగా హజ్‌ హౌస్‌ కట్టాం. అది మా చిత్తశుద్ది’ అని చంద్రబాబు గుర్తు చేశారు. యాత్రకు వెళ్లే వారికి కిట్‌ ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, ధూళిపాళ్ల నరేంద్ర, మాజీమంత్రి పుల్లారావు, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నసీర్‌ అహ్మద్‌తో పాటు పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

ధూళిపాళ్ల నరేంద్రను అడ్డుకున్న పోలీసులు

తెదేపా నాయకుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను మదర్సా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు రాకను పురస్కరించుకుని నియోజకవర్గంలోని మైనారిటీ నాయకులతో కలిసి ఆయన తొలుత అక్కడికి చేరుకున్నారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పెదాకాకాని ఎస్సై ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమెతో మాట్లాడుతుండగానే సీఐ సురేష్‌బాబు సైతం వచ్చి అడ్డుకోబోయారు. దీంతో నరేంద్ర మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నరేంద్ర ఒక్కరే వెళ్లాలని సీఐ కోరారు. తనతో పాటు ఉన్నవారందరినీ అనుమతించాక ఆయన లోపలికి వెళ్లారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని