కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ పనులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి: షబ్బీర్‌ అలీ

కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని మాజీమంత్రి షబ్బీర్‌అలీ డిమాండ్‌ చేశారు.

Published : 09 Jun 2023 04:19 IST

సదాశివనగర్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని మాజీమంత్రి షబ్బీర్‌అలీ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం భూంపల్లిలో చేపట్టిన ప్యాకేజీ పనులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘చలో భూంపల్లి’ కార్యక్రమం చేపట్టారు. దీనికి షబ్బీర్‌ అలీ హాజరై పనులను పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తిచేయకుండా భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ భారాస ప్రభుత్వానికి కమీషన్లు దండుకోవడమే తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదు. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు, పంటనష్ట పరిహారం, పంటల బీమా తదితర హామీలు నెరవేర్చకుండానే దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం. కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి జరగలేదని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దమ్ముంటే ప్రజాదర్బార్‌లో తేల్చుకుందాం రండి’’ అని షబ్బీర్‌ అలీ సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని