Bandi Sanjay: బండి తీవ్ర అసంతృప్తి

భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను దూరం చేయడం పట్ల బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated : 05 Jul 2023 09:39 IST

పార్టీ అవసరాల మేరకే మారుస్తున్నామని చెప్పిన నడ్డా
మీడియా కంటపడకుండా వెళ్లిన బండి

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను దూరం చేయడం పట్ల బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కీలక సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడం, ఒక వైపు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై అగ్రనేతలు ప్రశంసిస్తూనే పదవి నుంచి తప్పించడంతో ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి, కోశాధికారి శాంతికుమార్‌లతో కలిసి సంజయ్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. పార్టీ భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, నేతలు ఛుగ్‌, బన్సల్‌లతో సంజయ్‌ సుమారు 2గంటలపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కేంద్ర క్యాబినెట్‌ విస్తరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. పార్టీ అవసరాల మేరకే రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సంజయ్‌కు నడ్డా తెలిపినట్లు సమాచారం. సమావేశం అనంతరం సంజయ్‌ మీడియా కంటపడకుండా మరో మార్గంలో కారులో వెళ్లిపోయారు. కొద్దిసేపటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటలను నియమిస్తూ ప్రకటనలు విడుదలయ్యాయి. నడ్డాను కలవడానికి ముందే సంజయ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ను కలిసినట్లు సమాచారం.

నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు

భాజపా అధ్యక్ష పదవి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ట్విటర్‌లో బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహా భాజపా అగ్రనేతలకు, ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో తనను స్వాగతించిన ప్రజలకు, అరెస్టుల సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కిషన్‌రెడ్డి నేతృత్వంలో మరింత ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు.

హైదరాబాద్‌లోనే ఉన్నా మీడియాకు దూరంగా కిషన్‌రెడ్డి

భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తూ ప్రకటన వెలువడిన సమయంలో కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో రాష్ట్రపతితో కలసి పాల్గొన్నారు. తన నియామకంపై స్పందించలేదు. గచ్చిబౌలి స్టేడియం వద్ద, శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద కూడా దీనిపై ఏమీ మాట్లాడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని