భారాసలో చేరిక ప్రచారం అవాస్తవం

తాను కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాసలో చేరుతున్నానంటూ.. గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాలు, మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 30 Jul 2023 13:21 IST

నాపై కాంగ్రెస్‌లో కీలక నాయకుడి దుష్ప్రచారం
నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ: తాను కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాసలో చేరుతున్నానంటూ.. గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాలు, మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో తన స్థానాన్ని తగ్గించేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజల్లో నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఇలాంటి(పార్టీ మార్పు) దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. పార్టీలోని నా సహచరులు, అనుచరులను పథకం ప్రకారం అణగదొక్కుతున్నారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తి ఉన్నా.. జాతీయ పార్టీలోని విధివిధానాలను నేను అనుసరిస్తాను. నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారాలు, భూలావాదేవీలు లేవు. 30 ఏళ్లుగా ఓటమి లేకుండా ఆరుసార్లు గెలిచి నిరంతరాయంగా కాంగ్రెస్‌ పార్టీకి విధేయతతో పనిచేస్తున్నాను. గత రెండేళ్లుగా మాపై తప్పుడు, పరువునష్టం కలిగించే కథనాలు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీలోని ఓ నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూట్యూబ్‌ ఛానళ్లు, కొన్ని మీడియా సంస్థలు నాతోపాటు, నాభార్య గురించి తప్పుడు కథనాలను ప్రసారం చేయడం వేదనను కలిగించింది. వీటిని ఖండిస్తున్నా’ అని ఉత్తమ్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని