ఆగని సస్పెన్షన్ల పరంపర

పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. సోమవారం రికార్డు స్థాయిలో 78 మంది లోక్‌సభ సభ్యులు సస్పెండ్‌ కాగా మంగళవారం మరో 49 మందిపై వేటువేశారు.

Updated : 20 Dec 2023 06:13 IST

మరో 49 మంది ఎంపీలపై వేటు
శీతాకాల సమావేశాల్లో సస్పెండైనవారు మొత్తం 141

దిల్లీ: పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. సోమవారం రికార్డు స్థాయిలో 78 మంది లోక్‌సభ సభ్యులు సస్పెండ్‌ కాగా మంగళవారం మరో 49 మందిపై వేటువేశారు. పార్లమెంటులో భద్రత వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలనే డిమాండుతో గురువారం నుంచి ఇప్పటివరకు మొత్తం 141 మంది సస్పెండైనట్లయింది. ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోందని, ప్రస్తుత పరిస్థితి ఉత్తర కొరియా చట్టసభను గుర్తుచేస్తోందని విపక్ష నేతలు భగ్గుమన్నారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో తాజాగా సస్పెన్షన్‌కు గురైనవారిలో శశి థరూర్‌, మనీశ్‌ తివారీ, కార్తీ చిదంబరం (కాంగ్రెస్‌); డింపుల్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), సుప్రియా సూలె (ఎన్సీపీ), డానిశ్‌ ఆలీ (బీఎస్పీ) తదితరులున్నారు. వీరి సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని సభ ఆమోదించింది. మోదీ చిత్రాన్ని ధరించి కొందరు ఎంపీలు సభలోకి రావడం, వెల్‌లో నినాదాలు ఇవ్వడాన్ని జోషి తప్పుబట్టారు. విపక్ష ఎంపీల తీరు సభా నిబంధనలను విరుద్ధమని స్పీకర్‌ ఓంబిర్లా అన్నారు. ‘చివరిసారిగా హెచ్చరిస్తున్నా.. మీరు మీ స్థానాల్లోకి వెళ్లండి’ అని ఆయన చెప్పినా విపక్షం వెనక్కి తగ్గలేదు. సస్పెండైన ఎంపీలు వేసిన 27 ప్రశ్నలను సంబంధిత జాబితా నుంచి తొలగించారు.

బిల్లుల ఆమోదానికే..

సభలో తాము లేనప్పుడు ఎలాంటి చర్చ లేకుండా.. పౌరుల హక్కుల్ని కిరాతక చట్టాల ద్వారా అణచివేసే ‘అమానుష బిల్లు’ల్ని ఆమోదింపజేసుకునేందుకే పెద్దఎత్తున సస్పెండ్‌ చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. ఎంపీలను కాపాడడానికి బదులుగా సస్పెన్షన్ల ద్వారా ప్రజాస్వామ్యాన్ని (డెమోక్రసీని) కూల్చివేస్తున్నారని, ఇది అన్నిరకాల నిరంకుశత్వంతో కూడిన ‘‘నమోక్రసీ’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’ వేదికగా దుయ్యబట్టారు. ‘కొత్త పార్లమెంటు భవనం కట్టేముందు ఏం ఆలోచించారు? ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయాలనుకున్నారా? విపక్ష ఎంపీలందరినీ బయటకు పంపారు. నిందితులకు పాసులిచ్చిన భాజపా ఎంపీపై చర్యలు తీసుకోలేదు’ అని అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ పార్లమెంటు వెలుపల విమర్శించారు. ‘రాజ్యాంగానికి మరుభూమి’ ఇక్కడే కనిపిస్తోందని తీవ్రవ్యాఖ్య చేశారు. ‘త్వరలోనే పార్లమెంటు ఉత్తర కొరియా చట్టసభలా మారిపోతుంది’ అని కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. పారదర్శకత, జవాబుదారీ సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వ తీరు ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శించారు.  రాజ్యసభ మంగళవారం స్వల్ప విరామాలతో పలుమార్లు వాయిదాపడింది. హోంమంత్రి ప్రకటన చేయాలన్న పట్టును విపక్షం సడలించలేదు. ఉభయసభలు బుధవారానికి వాయిదాపడ్డాయి.

మెట్లపై నిరసన.. వీడియో తీసిన రాహుల్‌

సస్పెన్షన్ల అనంతరం విపక్ష సభ్యులు పార్లమెంటు భవన మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను మాటల్లో, చేతల్లో అనుకరిస్తూ తృణమూల్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ చేసిన హాస్య ప్రదర్శనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వీడియో తీశారు. కొందరు నేతలు స్పీకర్‌ను అనుకరించారు. రైతుగా, జాట్ల నేతగా ఉన్న తన నేపథ్యాన్ని అవమానించేలా ఈ ప్రదర్శన ఉందని, దానిని సీనియర్‌నేత వీడియో తీయడం మరింత బాధకు గురిచేసిందని ధన్‌ఖడ్‌ తప్పుబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని