YSRCP: ఉత్తరాంధ్ర వైకాపాలో చల్లారని అసమ్మతి

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి వైకాపా శ్రేణుల్లో అసంతృప్తులు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 20 Mar 2024 09:47 IST

అమర్‌నాథ్‌ తొలి ఆత్మీయ సమావేశానికే ఝలక్‌
స్పీకర్‌ తమ్మినేని అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తూ సీనియర్‌ నేతల రాజీనామా
డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల అవినీతిపై సొంత పార్టీ నేతల ఆగ్రహం

ఈనాడు-విశాఖపట్నం, విజయనగరం, ఈనాడు డిజిటల్‌-శ్రీకాకుళం: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి వైకాపా శ్రేణుల్లో అసంతృప్తులు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసమ్మతి బాధితుల్లో రాష్ట్ర మంత్రులు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఉండటం గమనార్హం.

అమర్‌ ఆత్మీయసభకు డుమ్మా

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఎట్టకేలకు గాజువాక అభ్యర్థిగా ప్రకటించారు. 16వ తేదీన తొలిసారి క్యాడర్‌తో అమర్‌నాథ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించగా ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు ఝలక్‌ ఇచ్చారు. సిటింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహా కీలక నేతలు దూరంగా ఉన్నారు. అమర్‌కు ముందు సమన్వయకర్తగా ఉన్న ఉరుకూటి చందు వర్గం డుమ్మాకొట్టింది. 73వ వార్డు కార్పొరేటర్‌ సుజాత ఒక్కరే హాజరవ్వగా, మిగిలిన ఏడుగురు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు.

  • విశాఖ దక్షిణంలో వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్‌పై మొదటి నుంచి వైకాపా కార్పొరేటర్లు పలువురు వ్యతిరేకిస్తున్నారు. వాసుపల్లి ‘ప్రతి పనికీ ఓ రేటు కట్టి లంచాలు వసూలుచేస్తారు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. వాసుపల్లి జానకిరామ్‌కు టికెట్‌ ఇవ్వాలని మత్స్యకారులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. గణేష్‌కే ఇవ్వడంతో మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షురాలు పెంటమ్మ మాస్టర్‌ తదితరులు ఆందోళనకు దిగారు.
  • వీఎంఆర్డీఏ మాజీ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మలకు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు తొలగించి, ఎంవీవీ సత్యనారాయణకు ఇచ్చారు. భీమిలి టికెట్‌ ఇస్తారని ఆశించినా, పార్టీ మొండిచేయి చూపడంతో అక్కరమాని అనుచరగణం కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు వ్యవహార శైలిపై పలువురు కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు.

శ్రీకాకుళంలో ఫలించని వైవీ మంత్రాంగం

ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ పొందూరుకు చెందిన సీనియర్‌ నేత సువ్వారి గాంధీ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ సువర్ణ, మాజీ ఎంపీపీ దివ్య పార్టీకి రాజీనామాలు చేశారు. కొత్తకోట బ్రదర్స్‌, చింతాడ రవికుమార్‌ వర్గీయులు తమ్మినేనిని వ్యతిరేకిస్తున్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని దువ్వాడ శ్రీకాంత్‌ వ్యతిరేకించారు. సీదిరి ఆధిపత్య ధోరణి, అవినీతి-అక్రమాలు, కళింగ సామాజికవర్గ నాయకులను వేధింపులకు గురిచేయడం వంటివాటిపై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా నేత హేమబాబు చౌదరి పార్టీని వీడగా, మరికొందరు అదే బాటలో ఉన్నారు.

ఇచ్ఛాపురంలో పిరియా విజయ వ్యతిరేకులు, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వడంతో.. ఆయన సతీమణి వాణి వర్గం ప్రచారాలు, సభలకు దూరంగా ఉంటున్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి వద్దంటూ మండలస్థాయి నాయకులు వ్యతిరేకించారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీను ప్రయత్నించినా ఫలించలేదు.


కోలగట్ల అవినీతిపై చర్చకు సవాల్‌

డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థిత్వాన్ని బీసీ నేతలు, కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. నగర వైకాపా నాయకుడు, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ అధ్యక్షుడు కాళ్ల గౌరీశంకర్‌ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. కోలగట్లకు ముడుపులిస్తే కానీ దేనికీ అనుమతులు రావన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానంటూ సవాల్‌ చేశారు. కోలగట్ల అభ్యర్థిత్వానికి నిరసనగా జిల్లా పార్టీ కార్యదర్శి అవనాపు విజయ్‌ నిరసన ర్యాలీ చేసి తెదేపాలో చేరారు. వైకాపా కార్పొరేటర్‌ సుమతి సైతం తెదేపాలో చేరారు. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమసంఘ అధ్యక్షుడు మధు సంఘ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు టికెట్‌ ఇవ్వడంపై అసమ్మతి రగులుతోంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం మండలాల్లో సమావేశాలు నిర్వహించి కడుబండిని ఓడిస్తామంటూ తీర్మానాలు సైతం చేశారు. ఎమ్మెల్సీని జగన్‌ పిలిపించి మాట్లాడినా అసమ్మతి జ్వాలలు ఆగలేదు. ఆయన సతీమణి ఎస్‌.కోట మండల పార్టీ ఉపాధ్యక్షురాలు సుధారాజు తన వర్గంతో తెదేపాలో చేరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని