పదేళ్లలో రైతులకు భాజపా చేసిందేమీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతుల సంక్షేమానికి ఏమీ చేయలేదని.. వారిని ముప్పుతిప్పలు పెట్టిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు.

Published : 16 Apr 2024 02:54 IST

ఈనాడు, పెద్దపల్లి: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతుల సంక్షేమానికి ఏమీ చేయలేదని.. వారిని ముప్పుతిప్పలు పెట్టిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. పెద్దపల్లిలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ నియోజకవర్గస్థాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటున్న భాజపా రుణమాఫీ, పంట నష్టపరిహారం, పంటల బీమా విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మోదీ హయాంలో ఎరువులు, పురుగుమందుల ధరలు పెంచడంతో పాటు, పంట ఉత్పత్తులకు కనీస మద్దతుధర ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న పాంచ్‌న్యాయ్‌ గ్యారంటీల్లో భాగంగా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పంట రుణమాఫీ, బీమా అమలుతో పాటు, పంటలు దెబ్బతింటే నెల రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామన్నారు. భారాస హయాంలో నేతలు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు 12 కిలోల వరకు కోతలు విధించారని ఆరోపించారు. అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇటీవల 36 గంటల రైతు నిరసన దీక్ష చేపట్టడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, చెన్నూరు శాసనసభ్యులు విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌, ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని