భాజపాది ప్రజాహిత మేనిఫెస్టో

భాజపా జాతీయస్థాయిలో సంకల్ప్‌పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజాహితమని, ప్రజామోదం పొందిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అభివర్ణించారు.

Published : 16 Apr 2024 02:57 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

రాజమహేంద్రవరం (దేవీచౌక్‌), న్యూస్‌టుడే: భాజపా జాతీయస్థాయిలో సంకల్ప్‌పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజాహితమని, ప్రజామోదం పొందిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అభివర్ణించారు. నగరంలో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, యువత, మహిళలు, రైతులు, వృద్ధులు.. ఇలా అన్నివర్గాలకూ మేలుచేసే అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. 24 రంగాలు, 10 సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందన్నారు. ఇప్పటికే మేకిన్‌ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం ఇప్పుడు తయారీ రంగానికి పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. 2014కు ముందు రోజుకు 12-14 కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగితే ప్రస్తుతం 28-30 కి.మీ. జరుగుతోందన్నారు. దేశంలో 80 కోట్ల మందికి అందిస్తున్న ఉచిత రేషన్‌ పథకం వచ్చే అయిదేళ్లపాటు కొనసాగిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. 70 ఏళ్లు దాటినవారికి ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచితవైద్యం అందించేలా పొందుపరిచారన్నారు. రైలుఛార్జీల్లో వృద్ధులకు సబ్సిడీలను తొలగించిన విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావించగా ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. కూరగాయల సాగు, వాటి నిల్వల కోసం నూతన క్లస్టర్ల ఏర్పాటు, డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెంపు, వందేభారత్‌, బుల్లెట్‌రైళ్ల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అవినీతికి తావులేని పరిపాలన, జమిలి ఎన్నికలు అనే ఆలోచనకు కట్టుబడి ఉందన్నారు. సీఎం జగన్‌పై రాయి విసరాడాన్ని ప్రస్తావించగా, శాంతిభద్రతల అంశాన్ని రాష్ట్రప్రభుత్వం, డీజీపీ చూసుకోవాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని