సీపీగా ఉండేందుకు కాంతిరాణా అనర్హుడు

సీఎం జగన్‌పై జరిగిన దాడి గురించి ఎనిమిది పోలీసు బృందాలు శోధించినా చివరకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన స్క్రిప్టునే విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా విలేకరుల సమావేశంలో చదివి వినిపించారని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు.

Published : 16 Apr 2024 02:59 IST

ఘటన జరిగి 48 గంటలైనా ఏం కనుక్కోలేకపోయారు
తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై జరిగిన దాడి గురించి ఎనిమిది పోలీసు బృందాలు శోధించినా చివరకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన స్క్రిప్టునే విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా విలేకరుల సమావేశంలో చదివి వినిపించారని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు విమర్శించారు. రాయి పరిమాణం సరిగ్గా తెలియదంటూనే, మరోవైపు అరచేతి పరిమాణంలో ఉండి సీఎం జగన్‌ నుదుటికి రాసుకుని వెళ్లి పక్కనే వెలంపల్లికి తాకిందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో సోమవారం మాట్లాడారు. ‘సీఎం బస్సుపై ఉన్నప్పుడు విద్యుత్‌ లేకపోతే ఫ్లడ్‌లైట్‌ పెట్టాలన్న ప్రొటోకాల్‌ పోలీసులకు తెలియదా? సీఎం రోడ్‌షో సమయంలో చుట్టుపక్కల భవనాల్లో బలగాలను మోహరించాలని తెలియదా? నిజంగా రాయి దాడి జరిగిందా? లేకుంటే ఏదైనా దండ తగిలిందా? వెలంపల్లికి మాత్రమే తగిలిందా? అనే సందేహాలకు సీపీ వివరణ ఇవ్వలేదు. 48 గంటల్లో కేవలం అరచేతి మందం రాయి అనే విషయాన్ని మాత్రమే కనుగొన్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘రాయి తగిలితే.. 3గంటల వరకు ఆసుపత్రికి వెళ్లకపోవడంలో ఆంతర్యమేంటి? సీఎం జగన్‌పై జరిగిన దాడి మీద స్పందించిన పోలీసులు.. ప్రతిపక్ష నాయకుడిపై జరిగితే ఎందుకు స్పందించలేదు? పోలీసుల వైఫల్యానికి ఈ ఘటనలే నిదర్శనం. రాష్ట్ర సీఎంపై దాడి జరిగినా డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఇంతవరకు స్పందించకపోవడమేంటి’ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని