జగన్‌ అహంకారం అంతమయ్యే ఎన్నికలివి

సానుభూతి కోసం గత ఎన్నికల్లో కోడి కత్తిని వాడుకున్న సీఎం జగన్‌ ఈసారి గులకరాయి డ్రామా ఆడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.

Updated : 16 Apr 2024 06:23 IST

జగన్‌ దళిత ద్రోహి
మళ్లీ వస్తే రైతుల పాసు పుస్తకాలపైనా అప్పులు చేస్తారు
‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో నందమూరి బాలకృష్ణ

నందికొట్కూరు, న్యూస్‌టుడే, ఈనాడు, కర్నూలు: సానుభూతి కోసం గత ఎన్నికల్లో కోడి కత్తిని వాడుకున్న సీఎం జగన్‌ ఈసారి గులకరాయి డ్రామా ఆడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. ఓటుతో వైకాపాకు బుద్ధిచెప్పాలని, జగన్‌ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో రానున్న ఎన్నికలు జగన్‌ అహంకారం అంతమయ్యే ఎన్నికలని అన్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో భాగంగా సోమవారం ఆయన కర్నూలు నగరం, నంద్యాల జిల్లా నందికొట్కూరులలో పర్యటించారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. అరాచకం కావాలా? అభివృద్ధి కావాలా?... సంక్షేమం కావాలా? విధ్వంసం కావాలా?... సమర్థ పాలన కావాలా? రాక్షస రాజ్యం, చీకటి పాలన కావాలా? అన్న విషయాన్ని నిర్ణయించుకోవాలన్నారు. దళితులకు అండగా ఉంటానంటూనే...వారి చావులకు కారణమయ్యారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన కారు డ్రైవర్‌ను హత్య చేసి డోర్‌ డెలివరీ చేశారని గుర్తుచేశారు. డాక్టర్‌ సుధాకర్‌ మృతికి వైకాపా నేతలే కారణమని అన్నారు.

అంబేడ్కర్‌ పేరుతో ఉన్న పథకాలకు జగన్‌ తన పేరు పెట్టుకున్నారని, ఆ మహనీయుని కంటే ఈయన గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. యువతను మత్తు పదార్థాలు, గంజాయికి బానిస చేశారని దుయ్యబట్టారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ పగల సెగలను చల్లార్చి శాంతికి చిరునామాగా మారిస్తే... వైకాపా నాయకులు నెత్తుటి మరకలు అంటించారని ఆరోపించారు. అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పు చేసిందని వివరించారు. జగన్‌కు మరోసారి అవకాశం ఇస్తే రైతుల పట్టాదారు పాసు పుస్తకాలను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకుంటారని, దాన్ని గుర్తించేలోగా ప్రజలకు సెంటు భూమి మిగలదని హెచ్చరించారు. జగన్‌ తన తల్లిని, చెల్లిని ఇంట్లోంచి గెంటేసి.. బాబాయిని చంపిన నిందితుడికి¨ ఆశ్రయం ఇచ్చారని ఆరోపించారు.  ‘జగన్‌..మీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలైంది. అరాచక ప్రభుత్వం పడిపోయేలా ఎన్నికల సునామీ రాబోతోంది. చేసిన దుర్మార్గాలకు చరమగీతం పాడతాం’ అని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని