జగన్‌పై దాడి ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి

జగన్‌ మీద జరిగిన దాడి ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని ఎన్డీయే నేతలు డిమాండ్‌ చేశారు. విజయవాడ సీపీ కాంతిరాణా అయితే సీఎం జగన్‌కు అనుకూలంగానే దర్యాప్తు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.

Published : 16 Apr 2024 04:35 IST

గవర్నర్‌కు ఎన్డీయే నేతల వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ మీద జరిగిన దాడి ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని ఎన్డీయే నేతలు డిమాండ్‌ చేశారు. విజయవాడ సీపీ కాంతిరాణా అయితే సీఎం జగన్‌కు అనుకూలంగానే దర్యాప్తు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగింది హత్యాయత్నం కాదని.. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జరిగిన కుట్రని విమర్శించారు. ఈ మేరకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో ఎన్డీయే నేతలు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘కోడికత్తి కేసులో శ్రీనును జైల్లో పెట్టినట్లే.. ఈ ఘటనలోనూ ఓ అమాయకుడిని ఇరికిస్తారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్లో ముఖ్యమైన దస్త్రాలను కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో కాల్చేసిన ఘటన గురించీ గవర్నర్‌కి వివరించాం. అస్సాం వెళ్తున్నానని, రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుందని గ్రహించి, చేసిన తప్పులు బయటపడతాయనే భయంతో రఘురామిరెడ్డి ఈ పత్రాలు కాల్చేశారు’ అని విమర్శించారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును బదిలీ చేయాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

ఓటమి భయంతోనే నాటకాలు

‘ఎన్నికల్లో ఓటమి ఖాయమని గుర్తించిన వైకాపా.. గులకరాయి డ్రామా తెరపైకి తీసుకువచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవడానికి జగన్‌ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్‌ మండిపడ్డారు. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా జగన్‌పైనే హత్యాయత్నాలు జరుగుతాయి. 2019లో జరిగిన కోడికత్తి కేసు ఇంతవరకు కొలిక్కి రాలేదు. తనను తాను కాపాడుకోలేని జగన్‌.. రాష్ట్రాన్ని, ప్రజలను ఎలా కాపాడతారు’ అని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ప్రశ్నించారు. సర్వేలన్నీ జగన్‌కు ప్రతికూలంగా ఉండటంతోనే ఇలాంటి నాటకాలకు తెరతీస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని