రాజీనామా పత్రంపై సంతకాలు చేయండి.. కౌంటర్లు పెట్టి 900 మంది వాలంటీర్ల నుంచి స్వీకరణ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వందల సంఖ్యలో వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు. మండపేటలో సోమవారం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు సమావేశం ఏర్పాటుచేశారు.

Updated : 16 Apr 2024 07:15 IST

మండపేటలో చర్చనీయాంశమైన వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు వ్యవహారం

మండపేట, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వందల సంఖ్యలో వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు. మండపేటలో సోమవారం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ నియోజకవర్గంలో 1,635 మంది వాలంటీర్లు ఉండగా సమావేశానికి 1200 మంది వచ్చారు. ‘‘వాలంటీర్లంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వైకాపా ప్రచారంలో పాల్గొనండి. మళ్లీ వచ్చేది వైకాపా ప్రభుత్వమే.. అందరినీ విధుల్లోకి తీసుకుంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో కొంతమంది వాలంటీర్లు వేదికపైకి వచ్చి, తామంతా జగన్‌ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు.

వాలంటీర్లతో రాజీనామాలు చేయించేందుకు గేటు వద్ద ఓ కౌంటరు ఏర్పాటుచేశారు. అప్పటికప్పుడు 900 మందికి పైగా సంతకాలు చేసినట్లు సమాచారం. అనంతరం వారితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశానికి, ర్యాలీకి ముందస్తుగా అనుమతి తీసుకోలేదని ఫిర్యాదు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డి.వి.ఎస్‌.ఎల్లారావు తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సమావేశాన్ని వీడియో తీశారని, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని