అధికార కాంగ్రెస్‌పై ప్రజాగ్రహం

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్‌కు.. అటు భాజపాకు రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 16 Apr 2024 05:07 IST

అన్నదాతలు మొదలుకొని ఆటో డ్రైవర్ల దాకా అందరిలో వ్యతిరేకత
మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్న భాజపా
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్‌కు.. అటు భాజపాకు రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో చెప్పుకోవడానికి భాజపాకు ఎజెండానే లేదని, అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా.. ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పి కొట్టాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో సోమవారం వరంగల్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేటీఆర్‌ విడివిడిగా సమావేశం నిర్వహించారు. ‘‘వరంగల్‌లో చివరి క్షణంలో కడియం కుటుంబం మన పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదు. ప్రజలంతా భారాస వెంటే ఉన్నారు. వరంగల్‌ నుంచి భారాస తరఫున బరిలో నిలిచిన డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగింది. 2001 నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన సుధీర్‌ గెలుపు కోసం పార్టీ నాయకులు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి. చైతన్యానికి ప్రతీకైన వరంగల్‌ ప్రజలు భారాసను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పెద్దపల్లిలో కూడా గులాబీ గెలుపు ఖాయం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈశ్వర్‌ లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే లోక్‌సభలో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అన్నదాతలు మొదలుకొని ఆటో డ్రైవర్ల దాకా ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి భారాస గెలుపు కోసం కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని