కాంగ్రెస్‌లోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ప్రజా పాలనకు ఆదరణ పెరుగుతున్నందునే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 16 Apr 2024 05:09 IST

 మెదక్‌, నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్లు సహా పలువురు కౌన్సిలర్లు కూడా..
ప్రజాపాలనకు ఆదరణగానే చేరికలన్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజా పాలనకు ఆదరణ పెరుగుతున్నందునే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం భాజపా, భారాసలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్‌ బాపూరావు, మదన్‌రెడ్డి, మెదక్‌, నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్లు వేర్వేరు వేదికల్లో కాంగ్రెస్‌లో చేరారు.

  •  ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బోథ్‌ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత రాథోడ్‌ బాపూరావు, నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ జి.ఈశ్వర్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చారు. ముఖ్యమంత్రి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సీఎం వారికి సూచించారు.
  • కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సోమవారం అనుచరులతో గాంధీభవన్‌కు వచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌధరి ఆయనకు పార్టీ కండువా కప్పారు.
  • మెదక్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌తో పాటు మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు(ఒకరు ఎంఐఎం, మిగిలిన వారు భారాస), కో-ఆప్షన్‌ సభ్యులు, మనోహరాబాద్‌ మండలం రామాయపల్లికి చెందిన ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఆత్మ పథకం కమిటీ వైస్‌ ఛైర్మన్‌ వెంకట్‌నారాయణ, మెదక్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ రాగి అశోక్‌లకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నర్సాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజిరెడ్డి పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని