పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్‌

పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్‌ నేతలు కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Published : 16 Apr 2024 05:12 IST

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్‌ నేతలు కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా 125 అడుగుల ఆయన విగ్రహానికి మంత్రులు, ముఖ్యమంత్రి నివాళులు అర్పించకపోగా.. ప్రజలు, ప్రజాసంఘాలు కూడా వెళ్లకుండా స్మృతి వనానికి తాళాలు వేయడం సరికాదు. కేసీఆర్‌ ఏర్పాటు చేశారన్న అక్కసుతో ఇలా వ్యవహరిస్తారా? కేసీఆర్‌ కట్టిన వాటి పట్ల వ్యతిరేకత ఉంటే.. రేపటి నుంచి సచివాలయంలో కూర్చోవడం మానేయండి. కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు పట్ల సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. భాజపా మీద పోరాడే దమ్ము కాంగ్రెస్‌ పార్టీకి లేదు. ఇక నుంచీ పోరాటం భాజపా మీదేనని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ చెప్పడం హాస్యాస్పదం. మరి ఇన్ని రోజులూ ఏంచేశారు? అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్‌ విఫలమైంది. పంటలు ఎండి ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించడానికి సీఎంకు, మంత్రులకు సమయమే లేదు. ఇకనైనా హామీల మీద దృష్టిపెట్టి అమలు చేయాలి. రైతులకు వరికి క్వింటాలుకు బోనస్‌ రూ.500 ఇవ్వాలి. మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలి’’ అని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో మరో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆస్తులను కాపాడుకోవడానికి రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి మారారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని