ప్రజల హక్కుల్ని భాజపా లాక్కొంటుంది: ప్రియాంక

ప్రజల హక్కుల్ని లాక్కొనేందుకు అధికార భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు.

Updated : 16 Apr 2024 06:07 IST

జైపుర్‌: ప్రజల హక్కుల్ని లాక్కొనేందుకు అధికార భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఆ పార్టీ అందుకే మాట్లాడుతోందని చెప్పారు. కేంద్రంలో పదేళ్లపాటు పాలన అందించిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు చేస్తున్న ప్రసంగాలు డొల్లగా ఉంటున్నాయని విమర్శించారు. రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌లో సోమవారం ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్‌-భాజపా మధ్య పోరుగా కాకుండా మన దేశ రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలుగా ప్రస్తుత సార్వత్రిక సమరం నిలిచిపోతుందన్నారు. ‘‘రాజ్యాంగం గురించి వేదికలపై మోదీ గొప్పగా చెబుతుంటే ఆయన పార్టీ ఎంపీలు మాత్రం దానిని మార్చేయడం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే ప్రజలకు హక్కులు మిగలవు. వారు తమకోసం ఏమీ డిమాండ్‌ చేయలేరు. ఓటుహక్కు కూడా పోతుందేమో.. ఇప్పుడు జరుగుతున్నవి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ఎన్నికలు. వీటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రియాంక కోరారు. మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌తో కలిసి అలవర్‌ నియోజకవర్గంలోనూ ఆమె రోడ్‌షోలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని