కలిసి పనిచేయడానికి అంగీకారం

పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

Published : 20 Apr 2024 03:09 IST

సీపీఎం నేతలతో భట్టి చర్చలు

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేతలు చెరుపల్లి సీతారాములు, వీరయ్యలతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం వారితో కలసి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని సీపీఎం నేతలు కూడా వెల్లడించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సీపీఎం కార్యాలయానికి వచ్చి చర్చించినట్లు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని వారిని అభ్యర్థించినట్లు తెలిపారు. సీపీఎం నాయకులు చెప్పిన అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి.. సమాధానం చెబుతామని భట్టి స్పష్టం చేశారు.

భువనగిరి కోసం పట్టు: ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించినందున కాంగ్రెస్‌ రాజకీయంగా సహకరించాలని సీపీఎం నేతలు కోరినట్లు తెలుస్తోంది. భువనగిరి స్థానాన్ని తమకు వదిలేస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మద్దతిస్తామని భట్టికి వారు చెప్పినట్లు సమాచారం. అది కూడా ఇవ్వడం కుదరకపోతే రాజకీయంగా కాంగ్రెస్‌ తమకు ఏం చేస్తుందో చెప్పాలని కోరినట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. భువనగిరిని కూడా వదులుకోవడానికి సీపీఎం సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని