22 నుంచి కేసీఆర్‌ బస్సుయాత్ర

భారాస అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర  ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు.

Published : 20 Apr 2024 03:17 IST

అనుమతి కోసం సీఈవోకి భారాస వినతిపత్రం

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర  ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ సీఈవోకు తెలిపామన్నారు. యాత్రకు సంబంధించి తగిన భద్రతాచర్యలు చేపట్టేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఈసీ దృష్టి సారించాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని కోరామన్నారు.  కేసీఆర్‌ తన యాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల పరిష్కారానికి భరోసా ఇస్తారని తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన రేవంత్‌రెడ్డి ఇంతవరకు ఒక్క గింజ కొనలేదన్నారు.

వివరణ ఇచ్చేందుకు కేసీఆర్‌కు 24 వరకు గడువు...

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో వివరణ ఇచ్చేందుకు భారాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు ఈనెల 24 వరకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. నియమావళికి విరుద్ధంగా ఇటీవల సిరిసిల్లలో కేసీఆర్‌ మాట్లాడారని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులో ప్రాధమిక ఆధారాలు ఉన్నాయంటూ ఈసీ బుధవారం నోటీసు జారీచేసింది. సమాధానం ఇచ్చేందుకు గురువారం ఉదయం 11 గంటల వరకు గడువు ఇచ్చింది. మరో వారం రోజుల గడువు కావాలంటూ కేసీఆర్‌ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం గురువారం పంపింది. ఆ లేఖను పరిశీలించిన ఎన్నికల సంఘం ఈ నెల 24 తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు  పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు