కుప్పంలో చంద్రబాబు నామినేషన్‌

కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 03:32 IST

ఆయన తరఫున దాఖలు చేసిన  భార్య భువనేశ్వరి
ధరావతు సొమ్మును విరాళంగా అందజేసిన ప్రజలు

ఈనాడు- చిత్తూరు, న్యూస్‌టుడే- కుప్పం పట్టణం: కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్‌ దాఖలు చేశారు. సెంటిమెంటు ప్రకారం తొలుత కుప్పంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మసీదు, బాబునగర్‌ చర్చిలో ప్రార్థనలు జరిపారు. కుప్పం చెరువు కట్టపై నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు. అక్కడి నుంచి తహసీల్దారు కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులుకు ఒక సెట్‌ నామినేషన్‌ సమర్పించారు. చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్‌ సమర్పించడం ఇదే తొలిసారి. 2014లో ఆయన కుమారుడు లోకేశ్‌ కార్యక్రమానికి రాగా, 2019లో స్థానిక నాయకులే నిర్వహించారు. 1989 నుంచి 2019 వరకు జరిగిన ఏడు ఎన్నికల్లోనూ తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. తాజాగా ఎనిమిదోసారి ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మాజీ ఎంపీటీసీ వి.శుభ ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించారు. నామినేషన్‌ రుసుము రూ.10 వేలను స్థానికులు, పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన విభిన్న ప్రతిభావంతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు తెదేపా ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కుప్పం తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఓటుతో రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలి

కుప్పం బస్టాండ్‌ వద్ద కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రజలందరూ చేయీచేయీ కలిపి రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని ‘చించేయాలి.. చించేయాలి’ అని సంకేతంగా చేతిలో ఉన్న పేపర్‌ను ఆమె చించేశారు. రాక్షసుల స్వభావం ప్రజలను పీక్కుతినడమని.. వైకాపా సర్కార్‌ కూడా అదే చేస్తోందని దుయ్యబట్టారు. మే 13న మనం కురుక్షేత్రం ఎదుర్కోబోతున్నామని.. ఓటే దానికి ఆయుధమని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు చూపించే ఉత్సాహం, ధైర్యం తనను ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు మరణించిన వ్యక్తులను పరామర్శించేందుకు ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని నిర్వహించి నా బిడ్డలైన కార్యకర్తలను కలుసుకున్నానని భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా పాలనలో చాలామంది కార్యకర్తలను నడిరోడ్డుపై చంపారని, ప్రజలను కూడా హతమార్చారన్నారు. ఈ పాలకులకు కావాల్సింది డబ్బు మాత్రమేనని ధ్వజమెత్తారు. కుప్పం అడ్డాలో తెలుగుదేశం జెండా తప్ప మరో జెండా ఎగరకూడదన్నారు. ‘చంద్రబాబు ప్రజల కోసమే పనిచేశారు. విభజన తర్వాత ఏమీలేని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఆయన శ్రమించారు. ఏపీˆ నంబర్‌ 1గా ఉండాలన్నది ఆయన కోరిక. రైతుల కోసం పోలవరం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కియా వంటి పరిశ్రమలు వచ్చేలా కృషి చేశారు. ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. పారిశ్రామికవేత్తలు ఆయనను నమ్మి పెట్టుబడులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలను విడదీయలేరు. ముందుకెళ్లి మన ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. తెదేపా- జనసేన- భాజపా జెండాలు మూడు కావచ్చు. ఎజెండా మాత్రం ప్రజల ప్రభుత్వమే’ అని భువనేశ్వరి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని