Updated : 28 Jun 2022 06:40 IST

Presidential Election: మరణశయ్యపై ప్రజాస్వామ్యం.. కాపాడేందుకే పోటీ

యశ్వంత్‌ సిన్హా ఉద్ఘాటన
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్‌
వెంట వచ్చిన రాహుల్‌గాంధీ, పవార్‌, ఏచూరి తదితర ప్రతిపక్ష నేతలు
హాజరై మద్దతు ప్రకటించిన కేటీఆర్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం మరణశయ్యపై ఉందంటూ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా (84) ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని కాపాడేందుకే ప్రస్తుతం తాను ఎన్నికల బరిలో దిగినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తూ రాష్ట్రాల అధికారాలను లాగేసుకుంటోందని విమర్శించారు. దేశంలో ప్రతి వ్యవస్థనూ అవినీతిమయం చేసి బలహీనపరుస్తోందనీ ఆరోపించారు. వచ్చే నెల 18న జరగబోయే 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, డీఎంకే రాజ్యసభాపక్ష నేత తిరుచ్చి శివ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మొత్తం నాలుగు సెట్ల నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ పి.సి.మోదీకి సిన్హా సమర్పించారు. తొలి సెట్‌ నామినేషన్‌ పేపర్లపై ప్రతిపాదకులుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే సంతకాలు చేశారు.

సిన్హా నామినేషన్‌ వేళ ప్రతిపక్షాలు తమ ఐక్యతను చాటిచెప్పే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగిస్తున్న పార్టీల నాయకులంతా రాహుల్‌గాంధీ, ఖర్గేల సమక్షంలో తొలుత భేటీ అయ్యారు. అనంతరం సిన్హాతో కలిసి ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లారు. విధానపరంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న పార్టీలకు చెందిన అఖిలేష్‌ యాదవ్‌, కేటీఆర్‌ వంటి కొందరు నేతలు వారికంటే ముందే అక్కడికి చేరుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12.07 గంటలకు సిన్హా రాహుల్‌గాంధీ, ఖర్గేలతో కలిసి తొలి సెట్‌ నామపత్రాలను, డిపాజిట్‌ కింద రూ.15 వేల నగదును రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. తర్వాత అఖిలేష్‌, కేటీఆర్‌, తిరుచ్చి శివ, అభిషేక్‌ బెనర్జీలతో కలిసి మరో మూడు సెట్లు సమర్పించారు. రిటర్నింగ్‌ అధికారి సుమారు 20 నిమిషాలపాటు నామినేషన్‌ పత్రాలను పరిశీలించి ఓకే చెప్పేంతవరకూ నేతలంతా అక్కడే కూర్చొని ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయటికొచ్చి.. పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.

హాజరుకాని ఆప్‌, జేఎంఎం

సిన్హా నామినేషన్‌ కార్యక్రమానికి ఆప్‌ ప్రతినిధులు హాజరుకాలేదు. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేఎంఎం తరఫున కూడా ఒక్కరూ రాలేదు. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సంతాల్‌ తెగకు చెందినవారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము కూడా అదే వర్గానికి చెందిన మహిళ. దీంతో జేఎంఎం ఆమెకు మద్దతిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిన్హాకు మొత్తం 21 పార్టీలు మద్దతిస్తున్నాయని నామినేషన్‌ ప్రక్రియ అనంతరం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విలేకర్లతో అన్నారు. ఆప్‌ కూడా తమ వెంటే ఉందని పేర్కొన్నారు. సీపీఐ, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌జేడీ, వీసీకే, ఐయూఎంఎల్‌, ఏఐయూడీఎఫ్‌ సహా మొత్తం 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొని సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కూడా సిన్హాకే మద్దతు ప్రకటించింది.

ఇది సైద్ధాంతిక పోరాటం: రాహుల్‌గాంధీ

రాష్ట్రపతి ఎన్నికను సిద్ధాంతాల మధ్య పోరాటంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. సిన్హా నామినేషన్‌ అనంతరం ఆయన విజయ్‌చౌక్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఆరెస్సెస్‌ ద్వేషం, శత్రుత్వ భావజాలానికి.. ప్రతిపక్షాల కరుణ, సౌభ్రాతృత్వానికి మధ్య ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక రూపంలో పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తిరుచ్చి శివ, అభిషేక్‌ బెనర్జీ తదితరులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రచారానికి కేరళ నుంచి శ్రీకారం

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తన ప్రచార పర్వానికి సిన్హా ఈ నెల 29న కేరళ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌తోపాటు వామపక్ష కూటమిలోని పార్టీలన్నీ తనకే మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు ఆయన తమిళనాడుకు వెళ్తారు. జులై 1న గుజరాత్‌, 2న కర్ణాటకల్లో పర్యటించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. జులై 1న తెలంగాణకు రావాలని సిన్హాను కేటీఆర్‌ కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ప్రాథమికంగా ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్న నేపథ్యంలో 2వ తేదీ తర్వాత వస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది.

ప్రచార పర్యవేక్షణ కమిటీలో రంజిత్‌ రెడ్డి

యశ్వంత్‌ సిన్హా తరఫున నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ కోసం విభిన్న విపక్ష పార్టీలకు చెందిన 11 మందితో ఓ కమిటీ ఏర్పాటైంది. ఇందులో తెరాస ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డికి స్థానం కల్పించారు. జైరాం రమేశ్‌ (కాంగ్రెస్‌), డి.రాజా (సీపీఐ), తిరుచ్చి శివ (డీఎంకే), సుఖేందు శేఖర్‌రాయ్‌ (టీఎంసీ), రాంగోపాల్‌ యాదవ్‌ (ఎస్పీ) తదితరులు కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

వ్యవస్థల దుర్వినియోగం: సిన్హా

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. వ్యవస్థలను దుర్వినియోగపరుస్తోందని యశ్వంత్‌ సిన్హా విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు అనంతరం దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘మా తల్లిదండ్రుల తరంవారు స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో పోరాడారు. స్వతంత్ర భారతావనితోపాటు ప్రజాస్వామ్యానికి పురుడుపోశారు. నా తరం వారు దానికి బలం చేకూర్చారు. కానీ మా తరం అంతరించిపోతున్న తరుణంలో ప్రజాస్వామ్యం మరణశయ్యపై ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని కాపాడతాం. ప్రస్తుతం అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్ద కేంద్రీకృతమయ్యాయి. పార్లమెంటు రబ్బరు స్టాంపుగా మారిపోయింది. ఎలాంటి చర్చ, సమీక్షలు లేకుండానే చట్టాలు చేసేస్తున్నారు. ఎన్నికల సంఘం, రిజర్వు బ్యాంకు, సీబీఐ, ఈడీ, కాగ్‌ వంటి వ్యవస్థలన్నింటినీ కేంద్రంలోని ప్రస్తుత సర్కారు దుర్వినియోగం చేస్తోంది. మైనార్టీలపై కక్ష సాధింపు కోసం బుల్డోజర్లు ఉపయోగిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి దర్యాప్తు పేరుతో కొందర్ని ఏళ్ల తరబడి జైలుపాలు చేస్తున్నారు’’ అని సిన్హా పేర్కొన్నారు.


విలేకర్లతో సిన్హా మాట్లాడిన అంశాల్లోని మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..

ఇతర దేశాల్లోనైతే ప్రభుత్వాలు కూలిపోయేవి

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలకు పెగాసస్‌ ఉదంతం ఓ ప్రబల ఉదాహరణ. ఇజ్రాయెల్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన ఆ స్పైవేర్‌తో దేశంలో అనేక మందిపై సర్కారు నిఘా ఏర్పాటుచేసింది. దాని బాధితుల్లో నాతోపాటు ఈ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఉన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను ధ్వంసం చేస్తున్న విషయం ప్రధానమంత్రి, ఆయన అనుంగులకు తెలుసు. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచి.. పార్టీలను చీల్చడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందడానికి వారు పెగాసస్‌ను ఉపయోగించారు. ప్రభుత్వాలు చేసే ఇలాంటి దుర్మార్గాలు బయటికి వస్తే పరిపక్వత పొందిన ఏ ఇతర ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రభుత్వాలు కూలిపోయేవి. కానీ ఈ ప్రభుత్వం నిసిగ్గుగా ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. అందుకు ఒక వర్గం మీడియా కొమ్ముకాస్తుండటం బాధాకరం.

రాజకీయ దిగజారుడుతనానికి ‘మహా’ సాక్ష్యం

నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. ఒకవేళ అధికారమే మా లక్ష్యమై ఉండి ఉంటే ఆ రోజు ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసి ఆ ఒక్క ఓటును పొందేవాళ్లం. కానీ ఆ పనిచేయలేదు. అధికారాన్ని చేజిక్కించుకోవడంకంటే మన దేశం, భవిష్యత్తు చాలా ముఖ్యం. అయితే ఏదేమైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో.. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి ప్రస్తుత సర్కారు ఎంతమాత్రమూ వెనకాడటం లేదు. అందుకు మహారాష్ట్రలోని పరిస్థితులే తార్కాణం. రాజకీయ దిగజారుడుతనానికి ఇదో సాక్ష్యం.

ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు

రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక సూత్రమైన లౌకికత్వాన్ని ప్రస్తుత పాలకులు అధికారం కోసం ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మైనార్టీ వర్గాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ఈ దేశం పట్ల విధేయతను నిరూపించుకోవాల్సిందిగా వారిని బెదిరిస్తున్నారు. వారిపై మూకదాడులు చేస్తూ బుల్డోజర్లను ప్రయోగిస్తున్నారు. వాళ్లు కలహాలు కోరుకుంటున్నారు.

అన్నీ అబద్ధాలే

సత్యమేవ జయతే అన్న సూత్రం ఆధారంగా మన రాజ్యాంగం ఏర్పడింది. కానీ ప్రస్తుత పాలకులు చెప్పేవన్నీ అబద్ధాలే. మన దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటుందన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు రప్పించడం ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు ఇస్తామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, 100 స్మార్ట్‌సిటీలు నిర్మిస్తామని, త్వరలో ప్రజలంతా బుల్లెట్‌ రైళ్లలో ప్రయాణిస్తారని, చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పారు. అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది.

ప్రధాని తప్పుడు నిర్ణయాలతో భారీ మూల్యం

అధికారం మొత్తం తన గుప్పిట్లో ఉంచుకోవాలన్న కాంక్షతో ప్రధానమంత్రి ఎవర్నీ సంప్రదించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకుంది. జీఎస్‌టీతో వర్తకులు, చిన్నతరహా వ్యాపారులు తుడిచిపెట్టుకుపోయారు. మహమ్మారి సమయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా పేదలు వందల కిలోమీటర్లు నడుస్తూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ఆక్సిజన్‌ లేక లక్షల మంది కన్నుమూశారు. రాష్ట్రపతి రబ్బరు స్టాంపులా వ్యవహరించాలని ప్రస్తుత పాలకపక్షం కోరుకుంటోంది.

మోదీ విధానాలను వ్యతిరేకించి..

రాజకీయాల్లోకి రాక ముందు సిన్హా ఐఏఎస్‌ అధికారి. 1984లో ఐఏఎస్‌గా రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1986లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1988లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989లో జనతా దళ్‌ ఏర్పడినప్పుడు దాని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో 1990 నవంబర్‌ 1991 జూన్‌ వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. జనతాదళ్‌ విచ్ఛిన్నమైన తర్వాత భాజపాలో చేరి వాజ్‌పేయీ సర్కారులో ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ భాజపా నుంచి బయటికొచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని